Mahaa Daily Exclusive

  దేశంలోనే తొలి ఫార్మా రైలు….

Share

దేశంలోనే తొలి ఫార్మా రైలు.
* ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ రయ్.. రయ్.
* హైదరాబాద్ నుంచి ముంబై జేఎన్‌పీటీకి అత్యధునిక శీతలీకరణ వసతులతో రవాణా.
* తెలంగాణకు తొలి రైలు కేటాయించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
* పీఎం గతిశక్తిలో భాగంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ రవాణాలో భారతీయ రైల్వే చారిత్రక ముందడుగు.

హైదరాబాద్, మహా.
ప్రయాణికుల సేవలు, సాధారణ వస్తు రవాణాలోనే కాకుండా అత్యున్నత సాంకేతికతతో భారతీయ రైల్వే సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఔషధాల రవాణా కోసం ప్రత్యేకంగా ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఫార్మసీ రైలును పట్టాలెక్కించింది. ‘ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన భాగ్యనగరం నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌ (జేఎన్‌పీటీ)కి ఔషధాలను అత్యంత సురక్షితంగా సరఫరా చేసేందుకు మే 2వ తేదీన ఈ రైలు లాంఛనంగా ప్రారంభమైంది. దేశంలోనే తొలి రెగ్యులర్ ఔషధి ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ వినూత్న ముందడుగుకు సహకరించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఆయన ఒక పత్రికా ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
హైదరాబాద్ మహానగర శివార్లలోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల పారిశ్రామిక వాడ, పటాన్‌చెరులోని ఫార్మా జోన్, ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ తదితర ప్రాంతాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఫార్మా ఉత్పత్తులను దేశం నలుమూలలకు, ప్రపంచ దేశాలకు సకాలంలో సరఫరా చేయాలంటే ముంబై సమీపంలోని జేఎన్‌పీటీకి చేరవేయడం అత్యంత కీలకం. ఈ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ను మరియు జేఎన్‌పీటీని అనుసంధానిస్తూ ప్రత్యేక రీఫర్ (కోల్డ్ స్టోరేజ్) రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో, పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థను నిర్మించాలనే సంకల్పంతో మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ. 100 లక్షల కోట్ల ‘పీఎం గతిశక్తి’ మహాక్రతువులో భాగంగానే ఈ ఔషధి ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రావడం విశేషం.
ప్రాణాలను నిలబెట్టే అత్యంత విలువైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నాణ్యత ఏమాత్రం తగ్గకుండా గమ్యస్థానాలకు చేర్చడం ఈ రైలు ప్రధాన ఉద్దేశం. ఫ్రీజర్ సదుపాయం లేకుంటే మందుల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, రైలు ప్రయాణిస్తున్నంత సేపు నిరంతరాయంగా తగిన ఉష్ణోగ్రత ఉండేలా డీజిల్ పవర్ ప్యాక్‌లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లను ఈ రైలులో ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కాంకర్) ఆధ్వర్యంలో సనత్ నగర్‌లోని ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) నుంచి ఈ ప్రత్యేక రైలు కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రైలు రాకతో మన దేశ కోల్డ్-చైన్ కనెక్టివిటీ నెట్‌వర్క్ మరింత బలోపేతం కావడంతో పాటు, ఫార్మాసూటికల్స్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం అమాంతం పెరగనుంది.
ప్రస్తుతానికి ఈ ఔషధి ఎక్స్‌ప్రెస్ సేవలు హైదరాబాద్ నుంచి జేఎన్‌పీటీ మధ్య వారానికి ఒకసారి నడుస్తున్నాయి. అయితే, పెరుగుతున్న డిమాండ్, వాణిజ్య వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే దీనిని వారానికి రెండుసార్లు నడిపేలా రైల్వే శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్పెషల్ రీఫర్ రేక్స్ సర్వీసు అందుబాటులోకి రావడంతో ఔషధాల నాణ్యత ఏమాత్రం తగ్గకుండా, అత్యంత తక్కువ రవాణా సమయంలో, అతి తక్కువ ఖర్చుతో సరఫరా వ్యవస్థ బలోపేతమవుతుందని వాణిజ్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాబోయే రోజుల్లో రవాణా రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.