Mahaa Daily Exclusive

  తెలంగాణలో వాహన ‘వేగం’…..

Share

తెలంగాణలో వాహన ‘వేగం’.
* రయ్‌.. రయ్‌.. రోజుకు 2,900 కొత్త బండ్లు.
* 2025-26లో రికార్డు స్థాయిలో 10.62 లక్షల కొనుగోళ్లు.
* హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలదే సింహభాగం.
* కొత్త వాహనాలపై మార్చి 1 నుంచి ‘రోడ్ సేఫ్టీ సెస్’ వసూలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోళ్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 10.62 లక్షల నూతన వాహనాలు రోడ్డెక్కాయి. రాష్ట్ర రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు, ఇతర అంశాలపై చేసిన తాజా అధ్యయనంలో ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతిరోజూ 2,900 కొత్త వాహనాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. మొత్తం కొనుగోళ్లలో 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలే ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కార్లు, ట్రాక్టర్లు నిలిచాయి. ప్రజా రవాణాను మెరుగుపరిచే దిశగా తెలంగాణ ఆర్టీసీ సైతం వెయ్యికి పైగా కొత్త బస్సులను ప్రవేశపెట్టింది.
నగరాలు, పట్ణణాలు వేగంగా విస్తరిస్తున్న కొద్దీ వాహనాల అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ సంస్థలు, వివిధ పరిశ్రమలు నెలకొన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహన రిజిస్ట్రేషన్లు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కొనుగోళ్లలో సగం వాహనాలు కేవలం మూడు జిల్లాలకే పరిమితం కావడం విశేషం. హైదరాబాద్‌ జిల్లా 1,97,539 వాహనాలతో అగ్రస్థానంలో ఉండగా, రంగారెడ్డి 1,87,044 వాహనాలతో, మేడ్చల్‌ 1,75,630 వాహనాలతో గట్టి పోటీనిస్తున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతుండటంతో సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్‌, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ వాహన కొనుగోళ్లు స్థిరంగా సాగుతున్నాయి. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు సైతం రిజిస్ట్రేషన్లలో సమానంగా పోటీ పడుతుండగా, అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాలు మాత్రం చివరి స్థానాల్లో నిలిచాయి.
రవాణా శాఖ గణాంకాల ప్రకారం 2025-26లో 7,26,389 ద్విచక్ర వాహనాలు, 1,62,105 మోటారు కార్లు రిజిస్టర్ అయ్యాయి. వ్యవసాయం, వాణిజ్య అవసరాల కోసం 54,831 ట్రాక్టర్లు, ట్రాలర్లు, 47,821 ఆటోరిక్షాలు, 39,801 గూడ్సు వాహనాలు కొనుగోలు చేశారు. ఇవే కాకుండా మోటార్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లతో పాటు ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థల బస్సులు కూడా గణనీయమైన సంఖ్యలో రోడ్డెక్కాయి. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా రవాణా శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ సంబంధిత దస్త్రాల సమర్పణను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చింది. వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేసిన 7 రోజుల్లోగా డీలర్‌ తప్పనిసరిగా పత్రాల్ని రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియలో జాప్యం చేస్తే సదరు వాహన డీలర్ల లాగిన్‌ను సస్పెండ్‌ చేస్తామని రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ‘రోడ్‌ సేఫ్టీ సెస్‌’ భారాన్ని మోపింది. మోటారు వాహనాల చట్టంలోని అధికారాలను వినియోగిస్తూ రవాణాశాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులు మార్చి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తేలికపాటి వాహనాల విభాగం కిందకు వచ్చే కార్లు, బైక్‌లతో పాటు ప్రయాణికుల ఆటోలు ఈ రోడ్ సేఫ్టీ సెస్ పరిధిలోకి వస్తాయి. వాహనం రిజిస్ట్రేషన్‌ చేయించే సమయంలోనే ఈ పన్ను కట్టాలి. అయితే వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. అలాగే 3 చక్రాల గూడ్సు వాహనాలపై గతంలో ఉన్న త్రైమాసిక పన్నును రవాణాశాఖ లైఫ్‌ట్యాక్స్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. రోడ్డు భద్రత చర్యల కోసం అవసరమయ్యే నిధుల సమీకరణ కోసమే ఈ పన్ను విధిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ నూతన సెస్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ. 270 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.