కన్నీరు పెట్టిన పొలం.
*పంట వ్యర్థాలు కాలుస్తూ వృద్ధ రైతు సజీవ దహనం.
• హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో తీవ్ర విషాదం.
హైదరాబాద్, మహా.
ఆరుగాలం కష్టపడి పండించిన నేలతల్లే ఆ వృద్ధుడికి కాటిగా మారింది. పచ్చని పొలంలో క్షణికావేశంలో రాజుకున్న మంటలు ఒక అన్నదాతను బలితీసుకున్నాయి. వ్యవసాయ పనుల్లో భాగంగా పంట వ్యర్థాలను తొలగించే క్రమంలో చెలరేగిన అగ్నికీలలకు ఓ వృద్ధ రైతు సజీవ దహనమైన హృదయ విదారక ఘటన హన్మకొండ జిల్లాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు నింపింది.
కొప్పుల గ్రామానికి చెందిన 74 ఏళ్ల గోలి జయపాల్ రెడ్డి అనే రైతు, తనకున్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇటీవలే పంట చేతికి రావడంతో, తదుపరి సాగు కోసం పొలాన్ని చదును చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పొలంలో మిగిలిపోయిన మొక్కజొన్న వ్యర్థాలను (కొయ్యకాళ్లు, చెత్త) కాల్చివేసేందుకు ఆయన నిప్పంటించారు. అయితే, ఎండల తీవ్రత మరియు పొలంలో వ్యర్థాలు పూర్తిగా ఎండిపోయి ఉండటంతో మంటలు ఊహించిన దానికంటే వేగంగా, పెద్ద ఎత్తున పొలమంతా విస్తరించాయి. వయసు పైబడిన జయపాల్ రెడ్డి మంటల తీవ్రతను అంచనా వేయలేకపోయారు.
ఒక్కసారిగా మంటలు తనవైపు దూసుకురావడంతో ప్రాణభయంతో ఆయన పరుగులు తీసే ప్రయత్నం చేశారు. కానీ, 74 ఏళ్ల వయసు.. దానికి తోడు పొలంలో కాలుజారి కింద పడిపోవడంతో మంటలు ఆయనను చుట్టుముట్టాయి. తనను తాను రక్షించుకునేలోపే అగ్నికీలలు ఆయన శరీరానికి అంటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. పొలంలో రాజుకున్న మంటలు, వృద్ధుడి హాహాకారాలు గమనించిన చుట్టుపక్కల రైతులు, స్థానికులు వెంటనే పరుగులు తీసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న జయపాల్ రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటన సాటి రైతాంగాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. వ్యవసాయంలో పంట కోతల అనంతరం వ్యర్థాలను తగలబెట్టడం అనేది దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ అయినప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ముఖ్యంగా ఎండాకాలంలో, గాలి వీచే దిశను బట్టి మంటలు క్షణాల్లో నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. జీవితకాలం మట్టినే నమ్ముకుని బతికిన ఆ వృద్ధ రైతు, చివరకు అదే మట్టిపై మంటల పాలై ప్రాణాలు వదలడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.








