- దిల్లీ ఎర్రకోట వద్ద బ్లాస్ట్ కేసు
- 7,500 పేజీలతో ఎన్ఐఏ ఛార్జిషీట్
- 10మంది నిందితులపై ఆరోపణలు
- నిందితులకు అల్ ఖైదాతో సంబంధాలున్నాయన్న ఎన్ఐఏ
న్యూఢిల్లీ, మహా : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు(మృతి) సహా 10 మందికి అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంది. ఈ మేరకు పటియాలా హౌజ్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 7,500 పేజీల ఛార్జిషీటు సమర్పించింది.
జమ్ముకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ ప్రాంతాల్లో విస్తృతంగా దర్యాప్తు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. 588 మంది వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు 395కుపైగా పత్రాలు, 200కుపైగా సాక్ష్యాలు సేకరించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ హై-ఇంటెన్సిటీ వాహన ఆధారిత ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (వీబీఐఈడీ) పేలుడుతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ (మృతి) సహా మొత్తం 10 మంది అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అనుబంధ సంస్థ అన్‌సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఏజీయూహెచ్)తో సంబంధాలు కలిగి ఉన్నారు. ఏక్యూఐఎస్ మరియు దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోంశాఖ 2018 జూన్‌లో ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించినట్లు ఎన్‌ఐఏ గుర్తుచేసింది. ఈ కేసులో యూఏ(పీ)ఏ చట్టం-1967, భారతీయ న్యాయ సంహిత-2023, ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-1908, ఆర్మ్స్ యాక్ట్-1959, ప్రజా ఆస్తుల నష్టం నివారణ చట్టం-1984 కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.
సాంకేతిక, ఫోరెన్సిక్ దర్యాప్తు ద్వారా భారీ జిహాదీ కుట్రను ఛేదించినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. కొందరు వైద్య వృత్తిలో ఉన్న నిందితులు కూడా ఏక్యూఐఎస్/ఏజీయూహెచ్ సిద్ధాంతాలకు ప్రభావితమై ఈ దాడికి పాల్పడ్డారని తెలిపింది. 2022లో శ్రీనగర్‌లో జరిగిన రహస్య సమావేశంలో తుర్కియే మార్గంగా ఆఫ్గానిస్థాన్‌కు వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత నిందితులు ఏజీయూహెచ్ ఇంటిరిమ్ పేరిట సంస్థను పునర్వ్యవస్థీకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడిన భారత ప్రభుత్వాన్ని కూల్చివేసి షరియా పాలనను అమలు చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ హెవెన్లీ హింద్ ప్రారంభించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
భారీగా పేలుడు పదార్థాల తయారీ
ఈ ఆపరేషన్‌లో భాగంగా కొత్త సభ్యులను చేర్చుకోవడం, జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేయడం, మార్కెట్లో లభించే రసాయనాలతో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వివిధ రకాల ఐఈడీలను తయారు చేసి పరీక్షించినట్లు కూడా ఎన్‌ఐఏ వెల్లడించింది. పేలుడులో ఉపయోగించిన ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ) పేలుడు పదార్థాన్ని నిందితులే రహస్యంగా రసాయనాలు సమకూర్చుకుని తయారు చేసినట్లు తెలిపింది. దిల్లీ పోలీసుల నుంచి కేసును స్వీకరించిన ఎన్‌ఐఏ, డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ ద్వారా మృతుడు నిందితుడు ఉమర్ ఉన్ నబీగా గుర్తించినట్లు తెలిపింది ఘటన స్థలంతో పాటు ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలు, వాయిస్ విశ్లేషణకు పంపించినట్లు వెల్లడించింది. నిందితులు అక్రమంగా ఏకే-47 రైఫిల్, క్రింకోవ్ రైఫిల్, దేశీయ తుపాకుల సహా సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది జమ్ముకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు రాకెట్, డ్రోన్‌లకు అమర్చే ఐఈడీలపై కూడా ప్రయోగాలు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.
దేశవ్యాప్తంగా విస్తరణ యత్నాలు
ప్రత్యేక ఎంఎంఓ అనోడ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్లు, స్విచ్‌లు వంటి ప్రయోగశాల పరికరాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా కార్యకలాపాలను విస్తరించాలని నిందితులు ప్రణాళికలు రూపొందించినప్పటికీ, ఈ ఉగ్ర మాడ్యూల్‌ను ఛేదించడం ద్వారా ఆ కుట్రను భగ్నం చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఎన్‌ఐఏ, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది.







