మోదీ ‘సప్త సూత్రాల’తోనే దేశ ఆర్థిక భద్రత.
• ఆత్మనిర్భర్ భారత్ దిశగా జాతీయ ఆర్థిక ఉద్యమం.
• దేశ స్వావలంబనలో ప్రజల భాగస్వామ్యమే కీలకం.
• ఆర్థిక ముఖచిత్రం మారాలంటే ప్రజల మితవ్యయమే మార్గం.
• బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు మేధోమథనం.
హైదరాబాద్, మహా.
దేశ ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలు మరియు భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించిన “సప్త సూత్రాలు – సప్త పరివర్తన” అంశంపై గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం, మీడియా సమావేశం ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర మీడియా టీమ్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పదాధికారులు, ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు విశేషంగా పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ముందుగానే దీటుగా ఎదుర్కోవాలని, అందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన ప్రత్యేక పాంప్లెట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వానిదే కాకుండా ప్రజల సామాజిక బాధ్యత కూడా ఎంతో ఉందన్నారు. దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం చేయడం మాత్రమే కాదని, జీవించి ఉండి దేశ ఆర్థిక భద్రతకు సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి అని ఆయన అభివర్ణించారు. “లోకల్ ఫర్ వోకల్” భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని కోరారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని సూచించారు. ప్రధాని మోదీ సైతం తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని దేశానికి ఆదర్శంగా నిలిచారని రాంచందర్ రావు గుర్తుచేశారు. సామాన్యులు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వినియోగించాలని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో తదితర ప్రజా రవాణా వ్యవస్థలను వాడాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ రంగంలో అమలవుతున్న కార్‌పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంధన పొదుపుకు ఎంతో మేలు చేస్తాయన్నారు. గతంలో మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ హయాంలో కూడా కఠిన పొదుపు చర్యలు చేపట్టారని గుర్తుచేసిన ఆయన, ఇప్పుడు ప్రధాని చేస్తున్న సూచనలను విమర్శించడం సరికాదన్నారు. తాను కూడా ఇటీవల ప్రజా రవాణాలోనే ప్రయాణించానని, విదేశాల్లోని ఉన్నతాధికారులు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారని ఆయన ఉదహరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారెడ్డి “సప్త సూత్రాల”పై సమగ్ర విశ్లేషణ అందించారు. అంతర్జాతీయంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని గణాంకాలతో సహా వివరించారు. ప్రధానమంత్రి సూచనలు కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే కావని, అది ప్రజల భాగస్వామ్యంతో సాగాల్సిన జాతీయ ఆర్థిక ఉద్యమమని స్పష్టం చేశారు. స్వదేశీ ఉత్పత్తులు, ఇంధన పొదుపు, వంటనూనె నియంత్రణ, సహజ వ్యవసాయం వంటి దైనందిన జీవితంలో చేసే చిన్నచిన్న మార్పులు దేశ ఆర్థిక శక్తిని గణనీయంగా పెంచుతాయని ఆయన విశ్లేషించారు.
ఇదే అంశంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ సప్త సూత్రాల ఆవశ్యకతను అంకెలతో సహా వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ సంక్షోభం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా (ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్) ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఏటా 700 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుండగా, ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకే పరిమితం కావడంతో ఏకంగా 25 లక్షల కోట్ల రూపాయల (300 బిలియన్ డాలర్ల) భారీ ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడుతోందని, ఇది కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు ఆయన సప్త సూత్రాల ప్రయోజనాలను ఇలా వివరించారు.
దేశంలో ఏటా 800 టన్నుల బంగారం (సుమారు రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లు) దిగుమతి అవుతోందని, ఇందులో 95 శాతం వ్యక్తిగత వినియోగానికే పోతోందని డాక్టర్ నర్సయ్య గౌడ్ తెలిపారు. భారతీయుల వద్ద అత్యధిక ప్రైవేట్ గోల్డ్ నిల్వలు ఉన్నందున, ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటే ఐదారు లక్షల కోట్ల ఫారెక్స్ మిగులుతుందని, ఆ డబ్బును రియల్ ఎస్టేట్ లేదా మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. అలాగే 11 లక్షల కోట్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి భారాన్ని తగ్గించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని, కేవలం 20 శాతం వాడకం తగ్గినా 3 నుంచి 4 లక్షల కోట్ల ఆదా అవుతుందన్నారు. కరోనా తరహాలో కనీసం 25 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తే 12 వేల కోట్ల విదేశీ కరెన్సీ మిగులుతుందని తెలిపారు. ఇక ఆరోగ్యపరంగా కూడా వంటనూనెల వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని ఒక వైద్యుడిగా ఆయన స్పష్టం చేశారు. ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల ఊబకాయం, షుగర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, ఏటా రూ. 1.6 – 2 లక్షల కోట్ల విలువైన వంటనూనెను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో దీనిని 20 శాతం తగ్గించినా వేలాది కోట్ల విదేశీ ద్రవ్యం ఆదాతో పాటు ప్రజల ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయన్నారు. వ్యవసాయంలో ఏటా 2 లక్షల కోట్ల ఎరువులు దిగుమతి చేసుకుంటున్నామని, కనీసం 20 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తే భూసారం పెరగడమే కాకుండా ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయని వివరించారు. అండర్ గార్మెంట్స్ నుంచి లగ్జరీ కార్ల వరకు ప్రతి అంచెలో స్వదేశీ వస్తువులను కనీసం 25 శాతం వినియోగిస్తే సుమారు 2 లక్షల కోట్లు, విదేశీ టూర్ల స్థానంలో దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తే దాదాపు 2.8 లక్షల కోట్ల మేర సంపద దేశంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లు దేశం ఏమీ క్లిష్ట పరిస్థితుల్లో లేదని బూర నర్సయ్య గౌడ్ కొట్టిపారేశారు. మన దగ్గర 60 నుంచి 70 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలతో పాటు 700 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు పటిష్టంగా ఉన్నాయన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా “యథా యధా హి శ్రేష్ఠ ఆచారేతి, తధా తధా జన అనువర్తేతే” అన్న మార్గంలో ప్రధాని మోదీ తానే ఆచరిస్తూ జాతికి మార్గనిర్దేశం చేస్తున్నారని, ఈ సప్త సూత్రాలను రాజకీయ కోణంలో కాకుండా జాతీయ ప్రయోజనాల దృష్టితో చూసి దేశాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని బీజేపీ నేతలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.








