మోదీ పిలుపుతో పవన్ ఆదర్శ నిర్ణయం.
* సగానికి కుదించుకున్న కాన్వాయ్.
* జెడ్ కేటగిరీ భద్రత ఉన్నా దేశ ప్రయోజనాలే మిన్న.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన పిలుపునకు ఆయన తక్షణమే స్పందించారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవాలన్న ప్రధాని మోదీ సూచనలను ఆచరణలో పెడుతూ.. తన అధికారిక కాన్వాయ్‌ను ఏకంగా సగానికి కుదించుకున్నారు. నాయకులు చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కేంద్రం కల్పించిన అత్యున్నత స్థాయి ‘జెడ్ కేటగిరీ’ భద్రత కొనసాగుతోంది. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెంట నిర్ణీత సంఖ్యలో భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్ వాహనాలు, బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఇంధన పొదుపును ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్న ఆయన తన భద్రతా అధికారులతో ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించారు. తన వాహన శ్రేణిలో ఉన్న వాహనాల సంఖ్యను వెంటనే 50 శాతానికి తగ్గించాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తనకు కల్పించిన జెడ్ కేటగిరీ భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండానే, అనవసరమైన హంగులకు పోకుండా కేవలం అత్యవసరమైన, పరిమిత వాహనాలతోనే కాన్వాయ్ ఉండేలా ప్రణాళికలు చేయాలని ఆయన సూచించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జారీ చేసిన ఈ ఆదేశాలకు అనుగుణంగా భద్రతా అధికారులు తక్షణమే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం నుంచే ఆయన కాన్వాయ్‌లో భారీ మార్పులు అమలు చేశారు. అధికారుల సమన్వయంతో సగానికి సగం వాహనాలను తగ్గించి పరిమిత కాన్వాయ్‌తోనే ఆయన ప్రయాణాలు సాగించారు. దేశవ్యాప్తంగా ప్రధాని సూచించిన ఇంధన పొదుపు, మితవ్యయం వంటి ‘సప్త సూత్రాల’ అమలుపై విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో, సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వయంగా తన కాన్వాయ్‌ను కుదించుకుని ఆచరించి చూపించడం పట్ల రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వీఐపీల భద్రత పేరుతో భారీగా ఇంధనాన్ని మండించే ఇతర నేతలకు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








