Mahaa Daily Exclusive

  కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి కరువు…..

Share

కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి కరువు.
* స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు బుట్టదాఖలు.
* కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే సంక్షేమం.
* కర్షకుల ఆదాయం పెంచే ఉద్దేశం కేంద్రానికి లేదు.
* పెరిగిన సాగు ఖర్చులకు ఎంఎస్‌పీ సరిపోదు.
* కేంద్రంపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు
హైదరాబాద్, మహా.

రైతు సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రాష్ట్ర మంత్రి తుమ్మల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభంపై ఆయన స్పందిస్తూ కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బుట్టదాఖలు చేసిందని ఆయన మండిపడ్డారు. రైతుల పట్ల కేంద్రానికి ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ సిఫార్సులను ఎప్పుడో అమలు చేసేవారని, కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు.
రోజురోజుకూ వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దానికి తగినట్లుగా కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఏమాత్రం సరిపోవడం లేదని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువుల నుంచి మొదలుకొని కూలీల రేట్ల వరకు ప్రతి దశలోనూ సాగు వ్యయం తడిసి మోపెడవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కేంద్రం నామమాత్రంగా పెంచుతున్న ఎంఎస్‌పీ వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గొప్పలు చెప్పడమే తప్ప, క్షేత్రస్థాయిలో వారి ఆదాయం పెంచే నిజమైన సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కాగితాలపై కనీస మద్దతు ధరను ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని, రైతులు పండించిన ప్రతి గింజనూ ఆ ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేసినప్పుడే అది అసలైన రైతు సంక్షేమం అనిపించుకుంటుందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.