- జూన్ 21న నీట్ యూజీ పరీక్ష
- వెల్లడించిన ఎన్‌టీఏ
- జూన్ 14 న అడ్మిట్ కార్డుల విడుదల
- విద్యార్థుల సౌలభ్యం కోసం సిటీని ఎంపిక చేసుకునేందుకు అవకాశం
న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న, ఆదివారం ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) శుక్రవారం వెల్లడించింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో, పరీక్షా విధానంపై నమ్మకాన్ని కాపాడేందుకు సదరు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. రీ-ఎగ్జామ్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విద్యార్థులను ఎన్‌టీఏ కోరింది. జూన్ 14 న అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. అయితే అంతకంటే ముందు విద్యార్థుల సౌలభ్యం కోసం సిటీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ఎంట్రెన్సీ కోసం మే 3న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీని నిర్వహించింది. కానీ, ఈ పరీక్ష ప్రశ్నపత్రాలను కొన్ని చోట్ల లీకయ్యాయని ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. దీంతో.. ఆ రోజు జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణను సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. పేపర్ లీక్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే క్రమంలో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఒకవైపు కొనసాగుతుండగానే, విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని ఎన్టీఏ ఈ రీ-ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.







