హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.
* సామాన్యుడిలా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం!
హైదరాబాద్, మహా.
వీఐపీ సంస్కృతికి దూరంగా ఉంటూ, సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకునే పాలకుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నారంటే పదుల సంఖ్యలో వాహనాలు, సైరన్ల హోరు, ట్రాఫిక్ ఆంక్షలతో సామాన్యులు గంటల తరబడి రోడ్లపైనే వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడటం మనం తరచుగా చూస్తుంటాం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ పాతకాలపు ఆర్భాటాలకు పూర్తిగా స్వస్తి పలికారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే అంతులేని వాహనాల శ్రేణి అనే భావనను చెరిపేస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భద్రతా సిబ్బందికి సంబంధించి అత్యవసరమైనవి మినహా, అనవసరమైన అదనపు వాహనాలన్నింటినీ పక్కనపెట్టేశారు. ఇకపై తన ప్రయాణాల్లో కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖర్చును తగ్గించడమే కాకుండా, నగర రోడ్లపై వాహనాల రద్దీకి తన వంతుగా ఎలాంటి అదనపు భారం పడకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు.
హైదరాబాద్ నగరవాసులకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో ఇకపై ఎక్కడా ట్రాఫిక్ ఆపకూడదని పోలీసు ఉన్నతాధికారులకు అత్యంత కఠినమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. తన కోసం విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే అంబులెన్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బంది పడకూడదన్నది ఆయన ముఖ్య ఉద్దేశం.
సాధారణ వాహనదారులతో పాటే, నగరంలోని రెగ్యులర్ ట్రాఫిక్ మధ్యనే తన కాన్వాయ్ కూడా ముందుకు సాగిపోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు. తన రాక కోసం ముందుగానే సిగ్నల్స్ నిలిపివేయడం, ప్రత్యేకంగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి రోడ్లను ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఒక రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉండి కూడా తన ప్రయాణం ఇతరుల దైనందిన జీవితాలకు ఆటంకం కాకూడదని ఆలోచించడం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. ప్రజా సేవకుడిగా ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండాలనే తన నినాదాన్ని ఆయన ఈ విధంగా చేతల్లో చేసి చూపిస్తున్నారు.
ఈ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, నిత్యం ట్రాఫిక్ తో సతమతమయ్యే నగరవాసులు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన ప్రజా నాయకుడి లక్షణం ఇదేనంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.








