బీఆర్ఎస్‌ది బద్నాం రాజకీయం.
*బండి సంజయ్ కుటుంబంపై కుట్రలు.
* మహిళల భద్రతపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు.
*కాళేశ్వరం, లిక్కర్ స్కామ్‌ల భయంతోనే కేటీఆర్ విష ప్రచారం.
*బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళలకు రక్షణ కరువు.
* ఎన్సీఆర్‌బీ లెక్కలతో ఎండగట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు.
* ఇంధన పొదుపు సందేశంతో ఎలక్ట్రిక్ కారులో రాక.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. అవినీతి కేసుల్లో తమ బండారం బయటపడుతుందనే భయంతోనే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బద్నాం రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల పాలనలో మహిళల రక్షణలో పూర్తిగా విఫలమై, దారుణమైన చరిత్రను మూటగట్టుకున్న బీఆర్ఎస్ నాయకులకు.. ఇప్పుడు నీతులు చెప్పే నైతిక హక్కు ఏమాత్రం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒకవైపు బీఆర్ఎస్ కుట్రలను ఎండగడుతూనే, మరోవైపు ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరిస్తూ స్వయంగా ఎలక్ట్రిక్ కారులో వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరుపై, ముఖ్యంగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి వల్ల రాజకీయ వాతావరణం అత్యంత దారుణంగా, కలుషితంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను నేరుగా ఎదుర్కోలేక, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు కోట్లు ఖర్చు చేసి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలన్నింటికీ స్వయంగా కేటీఆర్ నాయకత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ముందస్తు బెయిల్ తీసుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు అని ఆయన ఉద్ఘాటించారు. దానికి కూడా రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేయడం బీఆర్ఎస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ స్కామ్ కేసుల్లో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేయని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలపై జరిగిన అకృత్యాలను రాంచందర్ రావు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఎన్సీఆర్‌బీ గణాంకాల ప్రకారమే 2014లో తెలంగాణలో మహిళలపై 14,147 కేసులు నమోదు కాగా, 2023 నాటికి ఆ సంఖ్య ఏకంగా 23,679కి చేరిందని, దీనికి కేసీఆర్, కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అమానుష ఘటన, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై సామూహిక అత్యాచారం, వరంగల్‌లో మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి బలవన్మరణం, ఎల్బీనగర్ పోలీసుల కస్టడీలో లక్ష్మి మృతి వంటి ఘటనలు గత ప్రభుత్వ వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలని ఆయన గుర్తుచేశారు. ఇంతటి దారుణమైన చరిత్రను మూటగట్టుకుని, ఇప్పుడు మహిళల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు గానీ, బీఆర్ఎస్‌కు గానీ ఎక్కడుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఇదే సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ, సుస్థిర 12 ఏళ్ల పాలన విజయాలను రాంచందర్ రావు కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం “ఆత్మనిర్భర్ భారత్”, “వికసిత భారత్” లక్ష్యాల దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “మేరా భారత్ – మేరా యోగదాన్” కార్యక్రమం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. అంతర్జాతీయంగా నెలకొన్న చమురు కొరత నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. ప్రజలు కార్‌పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరారు. ఈ సందేశాన్ని ఆచరణలో చూపుతూ, ఆయన స్వయంగా ఎలక్ట్రిక్ కారులో పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ కోసం “ఒక చెట్టు – అమ్మ పేరు మీద” అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.








