Mahaa Daily Exclusive

  3 గంటల్లోనే హైదరాబాద్ టు ముంబయి….

Share

3 గంటల్లోనే హైదరాబాద్ టు ముంబయి.
• మూడు రాష్ట్రాలు.. 671 కిలోమీటర్ల ప్రయాణం.
• నదులు, కొండలను దాటుకుంటూ భూగర్భ మార్గాలు.
• ఒక్కో స్టేషన్‌కు 247 ఎకరాలు.. స్థలాల గుర్తింపు ముమ్మరం.
• 1,215 మంది ప్రయాణించేలా 16 బోగీలతో డిజైన్.
• హైదరాబాద్ నుంచి దేశ రాజధానికి హైస్పీడ్ కారిడార్.
హైదరాబాద్, మహా.

హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి ప్రయాణం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో 12 గంటలు, రైలు మార్గంలో 15 గంటల సుదీర్ఘ సమయం పడుతుండగా, ఇకపై కేవలం మూడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునేలా ‘హైదరాబాద్-పుణె-ముంబయి’ హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. గంటకు గరిష్ఠంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు కారిడార్‌కు సంబంధించి సర్వే పూర్తి కావడంతో పాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధమైనట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) తెలంగాణ ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబయికి కనిష్ఠంగా 2.55 గంటలు, గరిష్ఠంగా 3.13 గంటల్లోనే చేరుకోవచ్చు.
మొత్తం 671 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టును మూడు రాష్ట్రాల మీదుగా నిర్మించనున్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర పరిధిలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), తెలంగాణలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ఈ రైలు మార్గం ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ పరిధిలోని కోకాపేట, వికారాబాద్, అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో స్టేషన్లను ప్రతిపాదించారు. కర్ణాటకలోని కలబురగిలో ఒక స్టేషన్ ఉండగా, మహారాష్ట్రలో పుణె, బారామతి, పంఢర్‌పుర్, సోలాపుర్, విఖ్రోలి, థానే, నవీ ముంబయి, లోనావాలా, పింప్రిచించ్వాడ్ తదితర ప్రాంతాల్లో రైలు ఆగేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం దేశంలోనే ఓ అద్భుతమైన ఇంజనీరింగ్ ఘట్టంగా నిలవనుంది. హైదరాబాద్ మెట్రో రైలు తరహాలో పిల్లర్లపై ఎలివేటెడ్ ట్రాక్ నిర్మిస్తారు. అయితే, మహారాష్ట్ర పరిధిలోని మూడు ప్రాంతాల్లో ఏకంగా 35.30 కిలోమీటర్ల మేర మార్గాన్ని భూగర్భంలో నిర్మించనుండటం విశేషం. ఖండాల ఘాట్ ప్రాంతంలోని కొండలను తొలిచి 24 కిలోమీటర్ల పొడవునా మొత్తం 13 సొరంగాలను (టన్నెల్స్) నిర్మిస్తారు. ఈ కారిడార్ పొడవునా 13 స్టీల్ వంతెనలతో కలిపి మొత్తం 101 బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ముఖ్యంగా ప్రధాన నదులపై 29 భారీ వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ములా-ముఠా నదిపై 360 మీటర్లు, భీమా నదిపై 280 మీటర్లు, బోరి నదిపై 225 మీటర్ల పొడవైన భారీ వంతెనలు ఇందులో ఉన్నాయి.

బుల్లెట్ ట్రైన్ వేగమే కాదు, అవి ఆగే స్టేషన్లు కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలను తలపించేలా ఉండనున్నాయి. భవన నిర్మాణం, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఒక్కో స్టేషన్‌కు ఏకంగా 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు విషయమై ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ అధికారులు ఇటీవల రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్‌లతో సమావేశమై ప్రాజెక్టు విశేషాలను వివరించారు. కోకాపేట స్టేషన్ ఔటర్ రింగ్ రోడ్‌కు కేవలం 0.01 కిలోమీటర్, లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వికారాబాద్ స్టేషన్‌ను ప్రస్తుత రైల్వే స్టేషన్‌కు 2.3 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించారు. కోకాపేట వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఉండగా, వికారాబాద్ వద్ద పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల భూమి ఉన్నట్లు గుర్తించారు.

ఈ ప్రాజెక్టులో నడిచే ఒక్కో బుల్లెట్ రైలులో 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి 1,215 మంది ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించేలా కెపాసిటీని ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు ఆపరేషన్స్, నిర్వహణ కోసం మహారాష్ట్రలోని థానేలో భారీ బుల్లెట్ రైళ్ల డిపోతో పాటు వర్క్‌షాప్‌ను, హైదరాబాద్‌లో మరో డిపోను నిర్మిస్తారు. ముంబయిలో సెంట్రల్ ఆపరేషన్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రారంభ సంవత్సరంలో ప్రతిరోజూ 63,494 మంది ప్రయాణిస్తారని అంచనా వేయగా, ఈ సంఖ్య 2041 నాటికి 95,050 కి, 2051 నాటికి లక్షా 22 వేలకు పైగా, 2061 నాటికి ఏకంగా 1,52,092 కి చేరుకుంటుందని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.