- మేం రాజకీయాల్లోనే ఉన్నాం
- వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ
- భర్త మంచు మనోజ్ ప్రకటన
- మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చిన నటుడు
- ఐక్య దైర్య సంస్థ రాజకీయ వేదిక కాదని స్పష్టత
హైదరాబాద్, మహా : భూమా కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. భూమా వారసురాలిగా అఖిలప్రియ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె సోదరి భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని భూమా మౌనిక భర్త, సినీ నటుడు మంచు మనోజ్ స్వయంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య భూమా మౌనిక పోటీ చేస్తారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఐక్య ధైర్య సేనా సమితి పేరుతో ఇటీవల ట్రస్టు ఏర్పాటు చేసిన మంచు మనోజ్ దంపతులు… ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన మంచు మనోజ్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
ఐక్య ధైర్య సేనా సమితి రాజకీయ సంస్థ కాదన్న మంచు మనోజ్ ఈ సంస్థకు, రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజల తరుఫున, ప్రజా గొంతుకగా ఉండేందుకు ఐక్య ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రస్టు కోసం సొంత నిధులను ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారంటూ మంచు మనోజ్ ప్రకటించారు. ఇప్పటికే తాము రాజకీయాల్లో భాగంగా ఉన్నామన్నారు. మరోవైపు ఐక్య ధైర్య సేనా సమితి ట్రస్టు పేరును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో ఇటీవల మంచు మనోజ్ ప్రకటింప చేసిన విషయం తెలిసిందే. ఐక్య ట్రస్టు ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మే 20వ తేదీ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు.
భూమా మౌనిక.. ఏ పార్టీ నుంచి పోటీ
మరోవైపు వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారంటూ మంచు మనోజ్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనేదీ ఆసక్తికరంగా మారింది. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఇప్పటి వరకూ అధికారికంగా ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే భూమా కుటుంబం గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, టీడీపీలో పనిచేసింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు వైసీపీలో, టీడీపీలోనూ పనిచేశారు. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిలప్రియ వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మంచు కుటుంబానికి కూడా వైఎస్ జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమా మౌనిక పోటీ చేయాలనుకుంటే.. ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.








