Mahaa Daily Exclusive

  కుర్చీ తాత ఇకలేరు.

Share

• భార్య ఒడిలో తలవాల్చి శాశ్వత నిద్రలోకి.
• కన్నీరు పెట్టిస్తున్న కుర్చీ తాత తుది మజిలీ!

హైదరాబాద్, మహా.

సామాజిక మాధ్యమాల్లో ఒకే ఒక్క డైలాగ్‌తో కోట్లాది మందిని ఆకర్షించి, రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ షేక్ అహ్మద్ పాషా (కాలా పాషా) జీవితం అత్యంత విషాదాంతంగా ముగిసింది. “కుర్చీ మడతపెట్టి..” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎంతగా ఊపేసిందో.. నేడు ఆయన హఠాన్మరణం వార్త నెటిజన్లను అంతగానో కలచివేస్తోంది. ఎప్పుడూ తనదైన మాస్ శైలిలో, బిగ్గరగా అరుస్తూ అందరినీ నవ్వించిన ఆ గొంతు ఇక శాశ్వతంగా మూగబోయింది. ఆయన బయటకు కనిపించినంత ఉల్లాసంగా ఆయన నిజ జీవితం లేదని, ఆ నవ్వుల వెనుక ఒక ఒంటరి పోరాటం, కుటుంబ బాంధవ్యాల దూరం దాగి ఉన్నాయన్న వాస్తవం ఇప్పుడు అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. గతంలో పలుమార్లు ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చినప్పుడు నవ్వుతూ కొట్టిపారేసిన కుర్చీ తాత.. ఈసారి మాత్రం నిజంగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
విధి ఎంత విచిత్రమైనదంటే.. ఏ పార్కు పరిసరాల్లో అయితే ఆయన తన కాలమంతా గడిపారో, అదే పార్కు ఆయనకు ఆఖరి ప్రయాణానికి వేదికైంది. బుధవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడ సమీపంలోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బయట మండిపోతున్న ఎండల తీవ్రతకు ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. నడుస్తుండగానే వడదెబ్బ తగలడంతో పాటు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో, సోమ్మసిల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన స్థానికులు, ఆయనను వెంటనే ఇంటికి చేర్చారు. అప్పటిదాకా కుటుంబానికి దూరంగా, పార్కుల చుట్టూ ఒంటరిగా తిరిగిన ఆ వృద్ధుడు.. తన తుది శ్వాస విడిచే సమయానికి మాత్రం కన్నవారి చెంతకు చేరాడు. ఇంటికి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే, తన భార్య ఒడిలో తలపెట్టి ప్రాణాలు వదిలాడు. భర్త ఆకస్మిక మరణంతో ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
కుర్చీ తాత (అహ్మద్ పాషా)కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినప్పటికీ, కొన్ని కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా ఆయన గత కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఎండనక, వాననక రోడ్లపై, కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లోనే ఒంటరిగా తిరుగుతూ కాలం వెళ్లదీసేవారు. ఆయనలో ఒక ఆవేశం కనిపించినా, లోపల మాత్రం కుటుంబానికి దూరమయ్యానన్న బాధ ఎప్పుడూ ఉండేదని స్థానికులు చెబుతుంటారు. గతంలో ఆయన కనబడకుండా పోయినప్పుడు ఆయన భార్య మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం వారి మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి నిదర్శనం. చివరికి విధి కూడా ఆయన పట్ల కనికరించిందేమో.. ప్రాణాలు గాలిలో కలిసే ఆఖరి ఘడియల్లో ఆయన ఒంటరిగా కాకుండా, ఏ భార్యకైతే దూరంగా ఉన్నాడో అదే భార్య ఒడిలో తలపెట్టి ప్రశాంతంగా కన్నుమూశారు. నెట్టింట్లో మీమ్స్ ద్వారా కోట్లాది మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ఆ వృద్ధుడి కథ.. ఇలా ఒక కన్నీటి కావ్యంగా ముగియడం తీవ్ర విషాదాన్ని నింపింది.