బట్టబయలైన యూట్యూబర్ ఓకే సాయి బండారం..
*కారేపల్లి పీఎస్ లో కేసు నమోదు
*చీటింగ్, ఐటీ యాక్ట్ కేసులు
*పెట్టుబడి లేకుండా లక్షాధికారి కావచ్చనే కాన్సెప్ట్ తో…
*ట్రాప్ షిప్పింగ్ కోర్సు పేరుతో వంచన
*వంచనతో అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తిన యువకుడు
*ఆంధ్రకు చెందిన యువకుల ఫిర్యాదుతో వెలుగులోకి ఓకే సాయి బాగోతం..
కారేపల్లి, మహా:అతి సామాన్య కుటుంబం నుంచి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తిన పాతికేళ్ల యువకుడు ఒకే సాయి బండారం బట్టబయలైంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు చేసిన ఫిర్యాదు తో కారేపల్లి మండలం సూర్యాతండా కు చెందిన ఓకే సాయి పై కారేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ యువకుడి అక్రమాల పై చీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు.. ట్రాప్ షిప్పింగ్ కోర్సుల పేరుతో డబ్బులు కట్టి మోసపోయిన యువకులు ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ మోసాలపై రెండేళ్లుగా అనేక ఆరోపణలు వస్తున్నా గతంలో అధికారులు పట్టించుకోలేదు.. ఆంధ్ర యువకులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ఓకే సాయి (బానోత్ సాయినాథ్) పై కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఓకే సాయి అక్రమాలు వేలుగులోకి వస్తున్నాయి… ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజా, అర్ధాని శ్రీనివాస్, సూర్య భాను, శ్రీ పవన్ సాయి, విప్పర్తి దిలీప్, కొల్లి మనోహర్, చంద్రహాస రెడ్డి, బంటి అజయ్, నరసింహులు తో పాటు కొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఓకే సాయి చేతిలో మోసపోయి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
*పదేళ్లలో కోట్లకు పడగెత్తాడు.,.
ఈ యువకుడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడనే విషయం ఆ యువకుడు ఉండే తండావాసులు కూడా ఆశ్చర్యానికి గురి అవుతూ రకరకాలుగా చెప్పుకుంటుండగా… ఏడాదికిత మే ఓ యూట్యూబ్ ఛానల్ ఓకే సాయి యూట్యూబ్ మోసాలను బట్టబయలు చేసింది. ఆ యూట్యూబ్ ఛానల్ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలాకాలం వైరల్ అయింది.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లోని సూర్య తండాకు చెందిన సాయినాథ్ ఓకే సాయి పేరుతో గత కొన్నేళ్లుగా యూట్యూబర్ గా చలామణి అవుతూ కోట్లకు పడగెత్తాడు.. సూర్య తండాలో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే గుమస్తా కొడుకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా కోటీశ్వరుడు అయ్యాడని అందరి నోట ఆశ్చర్యానికి గురిచేసి అతను ఎలా ఎదిగాడనే దానిపై కోటి ప్రశ్నలు తలెత్తాయి. నిఘా విభాగాలు కూడా ఇతనిపై దృష్టి సారించకపోవడంతో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆ యువకుడు వందలాది మంది నుంచి కోర్సులో జాయినింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు….
*788 మంది నుంచి రూ.18000 చొప్పున వసూలు…
కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పెట్టుబడి లేకుండా తక్కువ కాలంలోనే లక్షాధికారి కావచ్చని నమ్మబలికి తన మాటల గారడితో వేలాది మందిని వంచిస్తూ కోట్లకు పరిగెత్తాడు. లక్షలు సంపాదించవచ్చు అని వేలాది రూపాయలు చెల్లించి కోర్సులు చేసిన వారంతా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మోసపోయామని మరో యూట్యూబర్ తో వారి గోడు వెళ్లబోసుకున్నారు. 788 మంది యువకుల నుంచి 18 వేల రూపాయల చొప్పున వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని మరో యూట్యూబర్ ఓకే సాయి బాగోతం బట్ట బయలు చేశారు.
*కారేపల్లిలో కోట్లతో భారీ భవనం…
విజయవాడలో ఫార్మసీ చదివి యూట్యూబర్‌గా చలామణి అవుతున్న సాయి స్వగ్రామం కారేపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాతికేళ్ల యువకుడు ఒంటిమీద అరకిలో బంగారంతో, ఓ ఖరీదైన కారులో తిరుగుతూ .. కారేపల్లి లో సుమారు రెండు కోట్లతో విలాసవంతమైన భవనాన్ని కూడా ఇటీవల నిర్మించాడు. అన్ని హంగులతో నిర్మించిన ఈ ఈ భవనం గురించి కూడా కారేపల్లి లో సూర్య తండాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.. అసలు ఈ యువకుడు ఏం చేసి సంపాదిస్తున్నాడు అనేది అందరికీ ప్రశ్నార్థకమైన పోలీస్ శాఖ మాత్రం ఎందుకు ఆరా తీయడం లేదనేది కూడా ప్రశ్నార్ధకంయింది. ఏడాది క్రితం హైదరాబాదులో కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకాకపోవటం తో ఇతనికి వారెంట్ ఇష్యూ అయింది ఆ సమయంలో కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆ కేసు కూడా ఓ చీటింగ్ వ్యవహారమేనని ఇప్పుడు వెలుగు చూస్తుంది. నిఘా వ్యవస్థలు ద్రుష్టి సారిస్తే ఈ ఓకే సాయి అక్రమాలన్నీ వెలుగు చూస్తాయి…
*కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం:కారేపల్లి ఎస్సై గోపి
సాయినాథ్ అలియాస్ ఓకే సాయి పై చీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయిందని కారేపల్లి ఎస్సై గోపి తెలిపారు. చీటింగ్ తో పాటు ఐటి యాక్ట్ కూడా ఉన్నందున ఈ కేసును సీఐ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.








