Mahaa Daily Exclusive

  ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టిన డిప్యూటీ కలెక్టర్‌..

Share

  • ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టిన డిప్యూటీ కలెక్టర్‌
  • ఏసీబీ తనిఖీల్లో రూ.వందల కోట్ల ఆస్తులు
  • మేడ్చల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ నిర్వాకం

హైదరాబాద్, మహా : మేడ్చల్‌ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ అవినీతి బాగోతం బయటికి వచ్చింది. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్ భారీగా ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు సంచలన ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌, పిగ్లీపురం ప్రాంతాల్లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వంశీమోహన్ కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. గురువారం తెల్లవారుజాము నుంచే డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వంశీమోహన్‌ ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లు సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇక ప్రభుత్వ భూమిని రియల్టర్‌కు ధారాదత్తం చేయడంతో.. అందుకు బదులుగా వంశీ మోహన్ కుటుంబ సభ్యుల పేరు మీద ఆ రియల్టర్ 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తిరిగి పొందినట్లు ఏసీబీ అధికారులు పక్కాగా ఆధారాలను సేకరించారు. ఆ ప్లాట్ల విలువ రూ.కోట్లల్లో ఉంటుందని గుర్తించారు.

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంశీమోహన్‌కు రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, డబ్బును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ భూములను.. అక్రమ రిజిస్ట్రేషన్లతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ.. రూ.కోట్ల డబ్బును లంచాల రూపంలో.. ప్లాట్లను తన కుటుంబ సభ్యుల పేరు మీదికి తెచ్చుకున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వంశీమోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.