Mahaa Daily Exclusive

  మహారాష్ట్రలో నెత్తురోడిన అడవి….

Share

మహారాష్ట్రలో నెత్తురోడిన అడవి.
* పెద్దపులి దాడిలో నలుగురు మహిళల దుర్మరణం!
* ఉత్తరాఖండ్‌లో మానవ మృగాల పైశాచికత్వం.
* విష ప్రయోగానికి రెండు పులిపిల్లలు బలి.

చంద్రపూర్ (మహారాష్ట్ర)మహా.
మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లిన నలుగురు అమాయక మహిళలను పెద్దపులి బలితీసుకుంది. ఈ దారుణ ఘటన చంద్రపుర్‌ జిల్లా గంజేవాహి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. గంజేవాహి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు, ఎప్పటిలాగే ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు శుక్రవారం ఉదయం అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో ఆకులు ఏరుకుంటున్న మహిళలపై అప్పటికే పొదల్లో మాటువేసిన పులి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ భయానక ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ప్రాణభయంతో కేకలు వేస్తూ అడవి నుంచి పారిపోయి బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే (45), అనుబాయి దాదాజీ మొహర్లే (40), సునీతా కౌశిక్‌ మొహర్లే (38), సంగీతా సంతోష్‌ (50)గా గుర్తించారు. వీరంతా గంజేవాహి గ్రామానికి చెందినవారే. పులి ఒకేసారి ఒకేచోట దాడి చేసిందా? లేక వేర్వేరు ప్రాంతాల్లో మహిళలపై దాడి చేసిందా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, పంచనామా అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చంద్రపూర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఎఫ్) ఆర్.ఎం. రామానుజన్ తెలిపారు.
**గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు**
ఈ ఘటనతో గంజేవాహి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్థులు అడవికి వెళ్లేందుకు వణికిపోతున్నారు. ప్రాణాలు తీసిన పులిని వెంటనే గుర్తించి బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రపూర్ జిల్లా పులుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. తరచూ పులులు జనావాసాల సమీపానికి రావడం, పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతుండటం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది.

** రెండు రోజుల్లోనే రెండు పులిపిల్లల దారుణ హత్య**

**హరిద్వార్ (ఉత్తరాఖండ్):** ఒకవైపు మహారాష్ట్రలో పులి దాడిలో మనుషులు చనిపోతే.. మరోవైపు ఉత్తరాఖండ్‌లో మనుషుల పైశాచికత్వానికి రెండు పులిపిల్లలు బలయ్యాయి. రాజాజీ టైగర్ రిజర్వ్ సమీప అటవీ ప్రాంతంలో రెండు పులిపిల్లల మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. హరిద్వార్ అటవీ విభాగ పరిధిలోని శ్యాంపూర్ రేంజ్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒక మగ పులిపిల్ల, ఒక ఆడ పులిపిల్ల కళేబరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ ఒకే తల్లికి జన్మించిన పిల్లలని అటవీశాఖ నిర్ధారించింది.
**పంజాలు నరికి.. ఆకులతో కప్పి..**
సజ్జన్‌పుర్ బీట్ అటవీ ప్రాంతంలో మే 18 (సోమవారం) అధికారులు నిర్వహించిన గాలింపు చర్యల్లో మొదట రెండేళ్ల వయసున్న మగ పులిపిల్ల కళేబరం బయటపడింది. దాని నాలుగు పంజాలను దుండగులు నరికి తీసుకెళ్లగా, చర్మం, దంతాలు మాత్రం అలాగే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తర్వాతి రోజు, అదే ప్రాంతానికి సుమారు 150 మీటర్ల దూరంలో మరో ఆడ పులిపిల్ల మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. ఈ కళేబరాన్ని ఒక వాగులో ఆకులతో కప్పి దాచిపెట్టినట్లు గుర్తించారు. దీనికి కూడా పంజాలు నరికివేసినట్లు వెల్లడైంది.
**విషం కలిపిన గేదె మాంసంతో ఎర**
ఈ ఘటనపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటవీశాఖ అధికారుల అనుమానం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఓ పులి వాన్‌ గుజ్జర్లకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది. అనంతరం గేదె మృతదేహాన్ని వెనక్కి తీసుకెళ్లిన గుజ్జర్లు కక్ష పూరితంగా దానిపై విషపదార్థం చల్లారు. ఆ విషపూరితమైన మాంసాన్ని తిన్న పులిపిల్లలు ప్రాణాలు విడిచాయి. అనంతరం నిందితులు వాటి పంజాలను నరికి అక్రమంగా విక్రయించేందుకు యత్నించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, తల్లి పులి కూడా అదే విషం కలిపిన మాంసం తిని ఉండొచ్చనే అనుమానాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. దీంతో అటవీశాఖ, రాజాజీ టైగర్ రిజర్వ్ అధికారులు సంయుక్తంగా అప్రమత్తమై.. తల్లి పులి ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.