వేల కోట్ల కుంభకోణం.
* ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై ఈడీ కొరడా.
* శంషాబాద్ భూదాన్ భూముల్లో భారీ స్కామ్.
* బ్యూరోక్రాట్ల బాగోతం బట్టబయలు.
* దొంగల పాలైన 94 ఎకరాలు.
* మే 25న మనీలాండరింగ్ కేసులో సంచలన విచారణ.
* తెలంగాణ రెవెన్యూ శాఖను కుదిపేస్తున్న ఈడీ దాడులు.
హైదరాబాద్, మహా.
**కంచే చేను మేసిన చందంగా.. రక్షకులే భక్షకులుగా మారి సాగించిన వెయ్యి కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణం గుట్టురట్టయింది! పేదల కోసం ఉద్దేశించిన 94 ఎకరాల పవిత్ర భూదాన్ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అత్యున్నత ఐఏఎస్ అధికారే.. వాటిని ప్రైవేట్ రాబందులకు అడ్డగోలుగా ధారాదత్తం చేసిన సంచలన బాగోతమిది. దశాబ్దాల రెవెన్యూ శాఖ అవినీతి పునాదులను కదిలిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా రంగంలోకి దిగి కొరడా ఝుళిపించడంతో.. భూమాఫియా,అవినీతి తిమింగలాల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి**
**రెవెన్యూ శాఖలో ప్రకంపనలు రేపుతున్న ఈడీ ఎంట్రీ**
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. ఎంతో విలువైన ప్రభుత్వ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత గల అధికారులే దగాకోరులుగా మారి పాల్పడిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపింది. శంషాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో జరిగిన భారీ భూ కుంభకోణంపై ఈరోజు ఈడీ అధికారులు తమ దర్యాప్తును అనూహ్యంగా వేగవంతం చేశారు. మనీలాండరింగ్ కోణంలో ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మహా దోపిడీలో పాలుపంచుకున్న బ్యూరోక్రాట్లు, రియల్ ఎస్టేట్ మాఫియా గుండెల్లో దడ మొదలైంది.
**ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు షాకిచ్చిన సమన్లు**
ఈ వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ అధికారులు ఈరోజు అధికారికంగా సమన్లు జారీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అత్యున్నత హోదాలో ఉండి, నిబంధనలను గాలికొదిలేసిన అమోయ్ కుమార్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు సేకరించిన ఈడీ, ఆయనపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో మే 25వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాలని స్పష్టమైన డెడ్‌లైన్ విధించింది. విచారణకు వచ్చే సమయంలో ఈ వివాదాస్పద భూములకు సంబంధించిన పూర్తి స్థాయి రెవెన్యూ రికార్డులను, డాక్యుమెంట్లను తమ ముందు ఉంచాలని ఈడీ అధికారులు జారీ చేసిన ఆదేశాలు పాలనా యంత్రాంగంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
**ధరణి సాక్షిగా 94 ఎకరాల భూదాన్ భూముల స్వాహా**
ఈ మహా కుంభకోణం వెనుక ఉన్న అసలు బాగోతం వింటే సామాన్యులు సైతం విస్మయానికి గురికాక తప్పదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన అత్యంత విలువైన భూదాన్ భూములను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, బడా వ్యాపారులకు అప్పగించేందుకు ఒక పకడ్బందీ కుట్ర జరిగింది. శంషాబాద్ పరిధిలోని సుమారు 94 ఎకరాల పవిత్ర భూదాన్ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి అత్యంత చాకచక్యంగా పక్కదారి పట్టించారు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట బదలాయించి, ఏకంగా మూడు వేర్వేరు సేల్ డీడ్స్ ద్వారా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేశారు. రికార్డులను తారుమారు చేసి సాగించిన ఈ పగటి దోపిడీ ఇప్పుడు ఈడీ రాకతో పూర్తిగా రట్టయ్యింది.
**వెయ్యి కోట్లకు పైగా విలువచేసే అక్షయపాత్ర**
అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న శంషాబాద్ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా బంగారు బాతు లాంటిది. ఇక్కడ గజం భూమి కొనాలంటేనే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఏకంగా 94 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు విస్తుగొల్పుతున్నాయి. ఈడీ ప్రాథమిక అంచనాల ప్రకారం, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ భూముల ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇంత భారీ ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేసి, దానికి చట్టబద్ధత కల్పించేందుకు వ్యవస్థలోని లొసుగులను వాడుకున్న తీరు చూస్తే దీని వెనుక మరెందరో బడాబాబులు ఉన్నారని స్పష్టమవుతోంది.
**రక్షకులే భక్షకులుగా మారిన దయనీయ స్థితి**
ఒక జిల్లాకు కలెక్టర్ అంటే ఆ జిల్లాలోని ప్రభుత్వ ఆస్తులకు ప్రధాన రక్షకుడు. కానీ ఆ రక్షకుడే భక్షకుడిగా మారి ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కైతే సామాన్యులకు దిక్కెవరు అనే ప్రశ్న ఈ వ్యవహారంతో ఉత్పన్నమవుతోంది. సర్కారు ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన రెవెన్యూ వ్యవస్థ, కాసులకు కక్కుర్తి పడి కబ్జాదారులకు కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఉన్నత స్థాయిలోని కొందరు అధికారుల అండదండలు లేకుండా కింది స్థాయి సిబ్బంది ఇంతటి సాహసానికి పాల్పడే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి, చట్టాలను తమ స్వార్థానికి అనుగుణంగా వంచుకుని వేల కోట్లు వెనకేసుకున్న ఈ సిండికేట్ తీరుపై పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
**మే 25న విచారణ.. ఇంకెన్ని తలకాయలు రాలుతాయో!**
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్ల నేపథ్యంలో మే 25వ తేదీన జరగబోయే విచారణ ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. విచారణలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ వెల్లడించే ఆధారాలతో ఇంకెంత మంది ప్రబుద్ధుల పేర్లు బయటకు వస్తాయోనన్న భయం చాలా మందిలో నెలకొంది. ఈ వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం వెనుక కేవలం అధికారులే కాకుండా, పలువురు బడా రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ స్కామ్‌కు సంబంధించిన డొంక మొత్తం కదులుతోందని, రానున్న రోజుల్లో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరియు రెవెన్యూ శాఖలో మరిన్ని సంచలన అరెస్టులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.








