విధి నిర్వహణలో సమర్థత పెరగాలి.
• ఆఫీస్ రూపురేఖలు మార్చండి.
• ఆఫీస్ అంతా ఒకే రంగు స్టాండర్డైజ్డ్ లుక్ ఉండాలి.
• ఫైళ్ల సర్దుబాటు రీడిజైనింగ్ పై దృష్టి పెట్టండి.
• పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ విస్తృత తనిఖీలు.
• మూడు గంటల పాటు విభాగాల పరిశీలన.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ప్రతి విభాగం ప్రజలకు మరింత సమర్థవంతంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని, కార్యాలయ వాతావరణంలో పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యం కనిపించాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. సోమవారం నాడు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు మూడు గంటల పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఆయన, విభాగాధిపతులతో అత్యున్నత స్థాయి సమీక్ష జరిపారు. ఆఫీసు అంతా ఒకే విధమైన రంగులతో స్టాండర్డైజ్డ్ లుక్ తీసుకురావాలని, టేబుళ్లపై ఫైళ్లను నిల్వ ఉంచకుండా వెంటనే రికార్డు రూమ్‌కు తరలించాలని ఆదేశిస్తూ, పరిపాలనలో వేగం పెంచేందుకు వీలుగా ఆఫీస్ రీ-డిజైనింగ్‌కు శ్రీకారం చుట్టారు.
పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ప్రతి ఒక్క విభాగం అత్యంత పరిశుభ్రంగా, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని తలపించాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో సిబ్బంది మరింత శ్రద్ధ వహించాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆఫీస్ రూపురేఖలను ఒక పద్ధతిలో మార్చేలా కార్యాలయంలోని గోడలు, అల్మారాలు, మరియు ఆఫీస్ టేబుళ్లకు ఒకే విధమైన రంగులు వేయించి చూడడానికి నీట్‌గా ఉండేలా చేయాలని సూచించారు. ఈ రంగుల మార్పు ద్వారా ఆఫీస్ వాతావరణం మరింత ప్రశాంతంగా, అందంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆఫీసుల్లో దస్త్రాల నిర్వహణ పక్కాగా ఉండాలని, ఎక్కడపడితే అక్కడ ఫైళ్లను అస్తవ్యస్తంగా పడేసే పద్ధతిని పూర్తిగా మానుకోవాలని డీజీపీ సిబ్బందిని గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం టేబుళ్లపై పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను మరియు పని పూర్తయిన దస్త్రాలను తక్షణమే భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక రికార్డు రూమ్‌కు తరలించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఏ ఫైల్ అయినా నిర్ణీత సమయంలోనే పూర్తి కావాలని, రికార్డులను సులభంగా వెతకడం కోసం కంప్యూటర్ పద్ధతులను ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమీక్షలు , అంతర్గత సమావేశాలు మరింత వీలుగా సాగేందుకు వీలుగా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని మౌలిక వసతుల మార్పుపై డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యాలయంలోని ప్రధాన కాన్ఫరెన్స్ హాల్ ట్రైనింగ్ హాల్ సహా ఇతర పరిపాలనా గదులను మరింత విశాలంగా, ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో మార్చేందుకు వీలుగా పునర్నిర్మాణం చేయాలని ఉన్నతాధికారులతో చర్చించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ కాన్ఫరెన్స్ హాళ్లను డిజిటల్ స్క్రీన్లతో ఆధునికీకరించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలు , సాంకేతిక ఆధారిత దర్యాప్తును వేగవంతం చేయడంలో టెక్నికల్ సర్వీసెస్ పాత్ర కీలకమని ఈ తనిఖీల్లో ప్రస్తావనకు వచ్చింది. ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్ తమ విభాగాల పరిధిలో ప్రస్తుతం సాగుతున్న ఆధునిక దర్యాప్తు పురోగతిని, పెండింగ్ కేసుల వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టెక్నాలజీ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తూనే, క్షేత్రస్థాయిలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాంతిభద్రతల నిర్వహణకు టెక్నికల్ సర్వీసెస్ మరింత చురుగ్గా సహకరించాలని డీజీపీ ఆనంద్ సూచించారు.
తెలంగాణ పోలీస్ శాఖకు దేశవ్యాప్తంగా ఉన్న మంచి గుర్తింపును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇటువంటి తనిఖీలు ఎంతో దోహదపడతాయని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ ఆశయాలకు అనుగుణంగా, పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు డీజీపీ కార్యాలయం నుండే ఈ మార్పులు ప్రారంభం కావడం విశేషం. అవినీతికి తావులేకుండా, సామాన్య ప్రజలకు తక్షణ న్యాయం జరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సమీక్ష ద్వారా స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి.ఈ విస్తృత తనిఖీలలో డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ వెంట పోలీస్ శాఖకు చెందిన అత్యున్నత స్థాయి ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎమ్. భగవత్, డీజీ (ఆర్గనైజేషన్ & హోంగార్డ్స్) స్వాతి లక్రా, డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు, , డీజీ (సీఐడీ) చారు సిన్హా తదితరులు డీజీపీ పర్యటనలో భాగస్వామ్యమయ్యారు.








