- గోహత్యలు ఆపండి
- గవర్నర్ కు వీహెచ్ పీ నివేదన
- సానుకూలంగా స్పందించిన గవర్నర్
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో చట్ట విరుద్ధమైన గోహత్యలను ఆపేందుకు తన వంతు చర్యలు తీసుకుంటానని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం శిక్షార్హమన్నారు. సమాజంలో అందరి విశ్వాసాలను గౌరవించాల్సిందేనని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ బృందం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను కలిసింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ గోరక్ష, సాధుసంతులు విభాగం నాయకులు గవర్నర్ కు కొన్ని విషయాలు నివేదించారు. రాష్ట్రంలో అక్రమ భైందోవర్లు కొనసాగిస్తూ తమ కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని వాపోయారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం తీరును గవర్నర్ కు వివరించారు. బక్రీద్ సందర్భంగా బలిచ్చేందుకు వేలాది గోమాతలను ఇప్పటికే డంపు చేసి ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని విడిపించి గోషాలలకు తరలించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు ఏ మాత్రం గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది గోమాతలు హత్యకు గురవుతుంటే పాలకులకు కనికరం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు ఇచ్చిన విలువ ఆవుకి ఇవ్వడం లేదని, హిందువుల విశ్వాసాలపై దాడులు చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఉపయోగించే పశువులను, మూడు సంవత్సరాల వయసుగల లేగ దూడలను అత్యంత ఘోరంగా హింసించి, వధిస్తున్నారని గవర్నర్ గారికి చెప్పారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ గారు మాట్లాడుతూ.. తన పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించి గోవుల రక్షణకు తక్షణమే చర్యలు చేపడతానని విశ్వహిందూ పరిషత్ నాయకులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు యాదగిరిరావు,రమేష్, పగుడాకుల బాలస్వామి , సుభాష్ చందర్, శ్రీ దుర్గానందపురి స్వామి, విశోక తీర్థ స్వామి , శ్రీకాంత్ ఇంద్ర స్వామి, కృష్ణ చాముండేశ్వరి నాథ స్వామి, హరి కిషన్ శర్మ , రేగు అనిల్ పాల్గొన్నారు.








