రాష్ట్రంలో ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’.
• మహిళలతో రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు.
• వడ్డీ లేని రుణాలు 10 లక్షలకు పెంపు.
• ఆడబిడ్డల ఆశీర్వాదమే ప్రభుత్వానికి శ్రీరామరక్ష.
• అంబానీ, అదానీలా ఎదగాలన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్.మహా.
తెలంగాణలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఉన్న మహిళా సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. మహిళా ఉత్పత్తులను అత్యంత నాణ్యమైన బ్రాండ్లుగా మార్చాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
**ఉచిత బస్సు ప్రయాణానికి 10 వేల కోట్లు**
ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు. గత 29 నెలల కాలంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ఆర్టీసీకి రూ. 10 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం కొంతమందికి నచ్చడం లేదని ఆరోపించారు. తాము మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా బస్సులకు యజమానులను చేశామన్నారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలు చేసే పెట్రోల్ వ్యాపారాన్ని మహిళలు సైతం చేయాలనే ఉద్దేశంతోనే పెట్రోల్ బంకులు పెట్టించామని వివరించారు.
**మహిళలతో రైస్ మిల్లుల ఏర్పాటు..**
మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బ్యాంకు లోన్ల చెల్లింపుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘాలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మహిళలతో రైస్ మిల్లులు పెట్టించడానికి, గోడౌన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రభుత్వం తరఫున కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దళారులు, వ్యాపారులు రైతులను మోసం చేయకుండా నిరోధించేందుకు.. ఇకపై మహిళా సంఘాల వద్దే వడ్లను భద్రపరిచేలా, మహిళల నుంచే మిల్లర్లు నేరుగా వడ్లు తీసుకెళ్లేలా పటిష్ఠ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.
**ఆడబిడ్డల ఆశీర్వాదమే శ్రీరామరక్ష**
రాష్ట్రంలో కొత్తగా రాబోతున్న మహిళా శక్తి సూపర్ బజార్లలో మహిళలే పెట్టుబడి పెట్టాలని సీఎం కోరారు. సొంత చెల్లినే ఇళ్ల నుంచి వెళ్లగొట్టే పరిస్థితులు కొందరిలో చూస్తున్నామని, తాము మాత్రం మహిళలను ఆడపడుచులుగా భావించి గౌరవిస్తున్నామని పరోక్ష విమర్శలు చేశారు. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటేనే ఈ ప్రజా ప్రభుత్వం కలకాలం నిలిచి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సచివాలయంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు వర్చువల్ విధానంలో ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.








