Mahaa Daily Exclusive

  అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర శోకం…

Share

అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర శోకం.
• రాష్ట్రవ్యాప్తంగా వానల బీభత్సం.
• చెల్లాచెదురైన ధాన్యం కుప్పలు.
• తడిసిముద్దయిన మక్కలు.
• రాజధానిలో నిలిచిన నీటి పంపింగ్.
• ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం.
హైదరాబాద్, మహా.
అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని అతలాకుత్రం చేసింది. ఎండవేడితో అల్లాడుతున్న భూభాగంలోకి అకస్మాత్తుగా తేమగాలులు ప్రవేశించడంతో ఆకాశంలో ప్రమాదకరమైన ‘క్యుములోనింబస్’ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఫలితంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు , గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కుంభవృష్టిగా కురిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం కొత్తమొల్గరలో అత్యధికంగా 112.3 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అదే జిల్లా కోయిల్‌కొండ పరిధిలోని పర్పల్లిలో 108.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 89.8 మిల్లీమీటర్లు, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 88.8 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసి ఊర్లను ముంచెత్తింది. అలాగే సంగారెడ్డి జిల్లా పాల్వట్ల, న్యాల్‌కల్, సిద్దిపేట జిల్లా శనిగరం, జోగులాంబ గద్వాల్ జిల్లా కాలూరు తదితర ప్రాంతాల్లోనూ 65 మిల్లీమీటర్ల నుంచి 75 మిల్లీమీటర్ల దాకా భారీ వర్షం కురిసి బీభత్సం సృష్టించింది.
ఈ అకాల వర్షం కష్టపడి పండించిన అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది. నెల రోజులుగా విక్రయాల కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై వాన నీళ్లు చల్లింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈదురుగాలుల ధాటికి ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో పోసిన ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో అమ్ముకోవడానికి తెచ్చిన దాదాపు 4 వేల క్వింటాళ్ల మక్కలు, 6 వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డు జలమయం కావడంతో వరద నీరు లోపలికి రాకుండా రైతులు అడ్డుకట్టలు వేస్తూ నానా అవస్థలు పడ్డారు. పెద్దపల్లి మార్కెట్ యార్డులోనైతే ఏకంగా ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. తూకానికి సిద్ధంగా ఉంచిన మక్కల బస్తాల్లోకి నీరు చేరడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ధాన్యం రాశులు తడిసిపోవడంతో తమను ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ప్రకృతి ప్రకోపానికి పలుచోట్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో పిడుగు పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బెల్లంపల్లి మండలంలోని కన్నాలలో, మెట్పల్లి పరిధిలోని తాళ్ల ధర్మారంలో పిడుగుల ధాటికి తాటి చెట్లు నిలువునా కాలిపోవడంతో చుట్టుపక్కల జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఉమ్మడి ఖమ్మం , ఉమ్మడి మెదక్ జిల్లాలో వీచిన ఈదురుగాలుల బీభత్సానికి పెంచాలపల్లి సహా పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో కరెంట్ వైర్లు తెగిపోవడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు చీకట్లోనే మగ్గిపోయారు.
ఇటు రాజధాని హైదరాబాద్ నగరంలోనూ వాన దంచికొట్టింది. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడగా.. లంగర్‌హౌస్, గోల్కొండ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. నగరంలో వీచిన గాలుల వల్ల చెట్లు కూలి విద్యుత్ లైన్లు ట్రిప్ అవ్వడంతో మంజీరా ఫేజ్-1, ఫేజ్-2 పంపింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి వేళ కరెంట్ నిలిచిపోయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన జలమండలి, విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. పంపింగ్ తిరిగి ప్రారంభమయ్యే వరకు నగర ప్రజలు నీటిని అత్యంత మితంగా వినియోగించుకోవాలని జలమండలి ఎండీ విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండు మూడు గంటల్లో హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ సహా దాదాపు 25 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.