Mahaa Daily Exclusive

  నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు…

Share

  • నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు
  • నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నితిన్ నబిన్
  • ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపురాలకు కొత్త సారధులు
  • వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న పంజాబ్ పై వ్యూహాత్మక దృష్టి

ఇంటర్నెట్ డెస్క్, మహా : ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై దృష్టి సారిస్తోంది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ గురువారం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న పంజాబ్ కు కొత్త అధ్యక్షుడిని నియమించారు. దీని ప్రకారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్‌ను, హరియానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్‌రాయ్‌ను నియమించారు. ఇంతకుముందు ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా, పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ ఝకార్, హరియాణా అధ్యక్షుడిగా మోహన్ లాల్ బదోలి, త్రిపుర అధ్యక్షుడిగా రజీబ్ భట్టాఛార్జీ ఉండేవారు.

పంజాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేవల్ సింగ్ ధిల్లాన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉండేవారు. తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడు. ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయాల్లో పంజాబ్‌కు ‘పెప్సీ’ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు ధిల్లాన్. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన హర్ష్ మల్హోత్రా తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన పార్టీ కోసం చాలా శ్రమించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. హరియాణా అధ్యక్షురాలిగా ఎంపికైన అర్చనా గుప్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. త్రిపురలో అత్యంత కీలక నియోజకవర్గమైన మతార్బారి నుంచి అభిషేక్ దేవరాయ్ పోటీ చేసి గెలిచారు. ఆయనకు తాజాగా అధ్యక్షుడిగా పదవి దక్కింది.

2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పంజాబ్‌లో ఒక సిక్కు ముఖాన్ని ప్రముఖంగా చూపించే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా బీజేపి కీలక నిర్ణయం తీసుకుంది. 2027 ఎన్నికల దిశగా పయనిస్తున్న పంజాబ్ బీజేపీ, కేవల్ సింగ్ ధిల్లాన్ నాయకత్వంలో ఎటువంటి కొత్త వ్యూహాలను అవలంబిస్తుందో వేచి చూడాలి. ధిల్లాన్ నియామకం అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) పంపిన ఒక వ్యూహాత్మక రాజకీయ సంకేతంగా కూడా పరిగణిస్తున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సొంత నియోజకవర్గమైన సంగ్రూర్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడైన ధిల్లాన్‌ను, పంజాబ్ రాజకీయాలను శాసించే ‘గ్రామీణ మాల్వా’ ప్రాంతంలో తన పట్టు పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న కీలక సమయంలో ఎంపిక చేయడం విశేషం. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత, పంజాబ్‌లో కేవలం పట్టణ ప్రాంత హిందూ ఓటర్లకే పరిమితమైన పార్టీగా ఉన్న ముద్రను తొలగించుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. మాల్వా ప్రాంతంలో బలమైన మూలాలు కలిగి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక ‘జాట్ సిక్కు’ నాయకుడిని నియమించడం ద్వారా, రాష్ట్రంలో ఒక విస్తృత సామాజిక ముఖాన్ని ఆవిష్కరించడానికి పార్టీ ప్రయత్నిస్తోంది.

కాగా, హర్యానాలో 43 ఏళ్ల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ డాక్టర్ గుప్తా. అంతకుముందు, 1980 నుండి 1983 వరకు డాక్టర్ కమలా వర్మ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించారు. పానిపట్‌లోని సమల్ఖాలో జన్మించిన డాక్టర్ అర్చనా గుప్తా, ఇక్కడే ఒక డయాగ్నస్టిక్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అట్టా గ్రామానికి చెందిన ఆమె తాతయ్య లాలా సూరజ్ భాన్ ఒక స్వాతంత్ర్య సమరయోధుడు.
ఆమె ఎంబిబిఎస్, రేడియాలజీలో ఎండి పూర్తి చేశారు. ఆమె విశ్వహిందూ పరిషత్‌లో చేరి, పానిపట్ నుండి “ఇండియన్ హెల్త్ లైన్”ను ప్రారంభించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమె బీజేపీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు.