Mahaa Daily Exclusive

  యువతకు ఉద్యోగాల వెల్లువ…..

Share

యువతకు ఉద్యోగాల వెల్లువ..
* నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి.
* జెన్-జీ సదస్సులో మంత్రి నారా లోకేష్ పిలుపు.
మంగళగిరి,మహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని, ఈ భారీ అవకాశాలను అందుపుచ్చుకునేందుకు యువత అంకితభావం, నైపుణ్యాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను అంతర్జాతీయ స్థాయి మానవ వనరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహానాడు ఉత్సవాల సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జెన్-జీ’ (Gen-Z) ప్రతినిధులతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానాలిస్తూ, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై ప్రభుత్వ దార్శనికతను సుదీర్ఘంగా వివరించారు.
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం క్లస్టర్ ఆధారిత విధానంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా డేటా, ఐటీ, క్వాంటం టెక్నాలజీ రంగాలతో పాటు రాయలసీమలో ఆటోమోటివ్, కర్నూలు జిల్లాలో పునరుత్పాదక ఇంధన వనరుల పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ఒకే ప్రాంతంలో ప్రధాన పరిశ్రమలతో పాటు వాటికి అనుబంధంగా ఉండే విడిభాగాల తయారీ యూనిట్లు కూడా కొలువుదీరుతాయని, తద్వారా పటిష్టమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్) సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి దాదాపు రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యా రంగంలో కీలక మార్పులు తెచ్చి పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న తప్పుడు ప్రచారాలు, ఫేక్ కంటెంట్‌పై యువత నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి తరహాలోనే హెచ్చరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే నిరాధార ఆరోపణలు సృష్టించి లక్షలాది మంది నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా కేవలం 150 రోజుల రికార్డు వ్యవధిలోనే డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్నైనా గుడ్డిగా నమ్మకుండా, వాస్తవాలను తార్కికంగా సరిచూసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.
విజయానికి ఎలాంటి సులువైన దారులు (షార్ట్‌కట్లు) ఉండవని, నిరంతర శ్రమ, పట్టుదల మాత్రమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడతాయని లోకేష్ తన వ్యక్తిగత రాజకీయ జీవితానుభవాలను యువతతో పంచుకున్నారు. “మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారితో నేను పోటీ పడాలంటే, ఆయన కంటే రెట్టింపు కష్టపడాలి. నా పాదయాత్రలో ఎన్నో సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాను. 2019 ఎన్నికల ఓటమితో నేను ఎప్పుడూ అధైర్యపడలేదు. మరింత పట్టుదలతో పోరాడి 2024లో ఏకంగా 91 వేల ఓట్ల భారీ మెజారిటీతో మంగళగిరిలో గెలిచాను. ఆనాడు ఓటమికి భయపడి ఉంటే ఈ రోజు ఈ విజయం దక్కేది కాదు” అని ఉద్ఘాటించారు. కేవలం పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో విద్యార్థులు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ఒక ఓటమి జీవితాన్ని ఎన్నటికీ శాసించలేదని ధైర్యం చెప్పారు.
దేశంలో మార్పు రావాలంటే చదువుకున్న యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని, వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సముచిత స్థానాన్ని, అవకాశాలను కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఇంటి నుంచే మహిళా సాధికారత ప్రారంభం కావాలని, స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలుకు సమాజమంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, బడా పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ సదస్సులో పలు యూనివర్సిటీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు వేమూరి సాత్విక్, చరణ్ యాదవ్, సత్యసాయి పవన్ కుమార్, ఖ్యాతి వర్థిని పాల్గొని మంత్రి లోకేష్‌తో తమ ఆలోచనలను పంచుకున్నారు.