- పటిష్టవంతంగా నీట్ రీటెస్ట్
- పీఎంవో పర్యవేక్షణలో పరీక్ష నిర్వహణ
- జూన్ 21 నిర్వహించే పరీక్షకు పడక్బంధీ ఏర్పాట్లు
- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 నిర్వహించే రీటెస్ట్‌లో మరోసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈసారి రీటెస్ట్ ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని తన నివాసంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్ రీటెస్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ తయారు చేయడం, ప్రింటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, పరీక్షా కేంద్రాలకు చేర్చడం వంటి ప్రతి ప్రక్రియను ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీట్ రీ టెస్ట్‌కు సంబంధించిన పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను మోదీ తెలుసుకుంటున్నారని వివరించాయి.
మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను పేపర్ లీక్ అయ్యిందన్న కారణంతో మే 12న రద్దు చేశారు. అనంతరం జూన్ 21న రీ-టెస్ట్ పెడతామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. కాగా, మే 3న దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,400కు పైగా కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాశారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ కారణంగా ఎగ్జామ్ రద్దవ్వడంతో వారు మరోసారి జూన్ 21న పరీక్షను రాయనున్నారు. మరోవైపు నీట్ యూజీ పేపర్ లీక్‌పై రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పరీక్షల నిర్వహణలో కేంద్ర సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా జరుగుతున్న నీట్ పేపర్ లీక్‌లకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వంలో పేపర్ లీక్ మాఫియా వర్ధిల్లుతోందని ఆరోపించారు. కానీ బాధ్యత వహించాల్సినవారు మాత్రం కూర్చొని వేడుక చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం, నీట్ రీ టెస్ట్‌పై దృష్టి సారించింది.







