Mahaa Daily Exclusive

  కళలకు, సాహిత్యానికి ప్రాంతీయ భేదాలు లేవు….

Share

*కళలకు, సాహిత్యానికి ప్రాంతీయ భేదాలు లేవు.
*అమరావతిలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలకు చోటివ్వండి.
* ఏపీ సీఎం చంద్రబాబుకు జర్నలిస్ట్, ఉద్యమకారిణి రాణీ రుద్రమారెడ్డి విజ్ఞప్తి
* చొరవ తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కోరిక.
హైదరాబాద్, మహా.
కళలకు, సాహిత్యానికి, రాజకీయాలకు ప్రాంతీయ విబేధాలు ఉండవని, తెలుగు వారంతా ఒక్కటేనన్న సత్భావనను పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలను నెలకొల్పాలని ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారిణి శ్రీమతి రాణీ రుద్రమారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆమె ఒక ఆత్మీయ లేఖ ద్వారా మనవి చేశారు. భాషా సంస్కృతుల పరంగా రెండు రాష్ట్రాల మధ్య వారధిగా నిలిచే ఈ బృహత్తర కార్యానికి అనుమతినివ్వాలని కోరారు.
దేశానికి ప్రధానిగా సేవలందించిన ఏకైక తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావుతో పాటు తెలంగాణ గడ్డ గర్వించదగ్గ ప్రముఖులు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సినారె, ప్రముఖ సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ అస్తిత్వ ప్రతీక కాళోజీ నారాయణరావు, ప్రముఖ నటులు కాంతారావు, మహాభాగవతాన్ని ఆంధ్రీకరించిన బమ్మెర పోతన తదితరుల విగ్రహాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. కృష్ణానది తీరంలో, ఏపీ సచివాలయ పరిసరాల్లో ఈ మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటేనన్న భావనను ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాటిచెప్పారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, యుగపురుషుడు ఎన్టీ రామారావు విగ్రహంతో పాటు, రవీంద్రభారతిలో ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలను ఏర్పాటు చేసి సీఎం ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ వైతాళికులకు సముచిత స్థానం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
అమరావతిలో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు వెయ్యి మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు స్వయంగా ఆయా విగ్రహాలను అమరావతికి తీసుకువస్తామని రాణీ రుద్రమారెడ్డి స్పష్టం చేశారు. ఆ విగ్రహాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేసుకుంటామని వివరించారు. ఈ సుహృద్భావ వాతావరణం మరింత బలపడేలా, ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేక చొరవ తీసుకొని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.