రెచ్చగొట్టే వ్యాఖ్యల కలకలం.
* పోలీసులకు లొంగిపోయిన బాల్క సుమన్.
*సింగరేణి ఆస్తుల విధ్వంసానికి కుట్ర పన్నారంటూ నాంపల్లి పీఎస్‌లో కేసు.
*మూడు రోజుల ఉత్కంఠకు తెర.
* తెలంగాణ భవన్లో లొంగిపోయిన వైనం.
హైదరాబాద్, మహా .
ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా సింగరేణి కార్యాలయాలను ధ్వంసం చేయాలంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్ సెక్యూరిటీ అండ్ పీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ బి.ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు సుమన్‌పై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూడు రోజులుగా ఆయన అరెస్టు కోసం గాలిస్తున్న సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ బృందాలు.. ఆయన తెలంగాణ భవన్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్నాయి. నాంపల్లి ఏసీపీ, సీఐల నేతృత్వంలో భారీ సంఖ్యలో పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అరెస్టును అడ్డుకునేందుకు సుమన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 326 అత్యంత తీవ్రమైనదని, కేవలం కామెంట్స్ చేసినంత మాత్రాన ఆ సెక్షన్ వర్తించదని వారు వాదించారు. మరోవైపు సుమన్ భవన్లో లేరని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు నేరుగా భవనంలోకి వెళ్లేందుకు సిద్ధపడటం, అరెస్టు తప్పదని తేలిపోవడంతో సుమన్ స్వయంగా కిందకు వచ్చి పోలీసులకు లొంగిపోయారు.
లొంగిపోవడానికి కొద్దిసేపటి ముందు బాల్క సుమన్ తెలంగాణ భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, భవన్‌లోనే ఉంటూ ఓ యాప్ తయారీ పనుల్లో నిమగ్నమయ్యానని స్పష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల తర్వాత తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, ఇప్పుడు మళ్లీ అదే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనపై పెట్టిన కేసులు పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సింగరేణి ప్రస్తుతం కుంభకోణాలకు నిలయంగా మారిపోయిందని, తొమ్మిది పది జిల్లాలకు విస్తరించిన సంస్థలో కార్మికులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వడ్లు కొనమని అడిగినందుకు అశోక్ అనే ఆర్టీసీ డ్రైవర్‌ను వేధించారని, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. చట్టంపై తమకు గౌరవం ఉందని తెలిపిన ఆయన.. తమను జైలుకు పంపించడంపై చూపిస్తున్న శ్రద్ధను, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చూపించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. జైళ్లు తమకు కొత్త కాదని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. మందమర్రిలోని సింగరేణి జీఎం ఆఫీసును, హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను తగులబెట్టాలని, రైల్వే ట్రాక్‌లను కోసివేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. “మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. సోషల్ మీడియా, ప్రెస్ మీట్లతో లాభం లేదు. మందమర్రిలో ప్రోగ్రాం పెట్టి జీఎం ఆఫీస్ కాలబెడదాం. పోతే నెల రోజులు జైలుకు పోయివస్తాం.. అవసరమైతే సింగరేణి భవనం కాలబెట్టండి.. రైలు పట్టాలు కోసిపారేయండి.. ఈ పనులు చేస్తే పైసలు తన్నుకుంటూ వస్తాయి” అంటూ సుమన్ చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజీని ఫిర్యాదుదారులు పోలీసులకు అందజేశారు. ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులకు, సింగరేణి ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న అత్యంత కఠినమైన సెక్షన్ 326 (మారణాయుధాలు, నిప్పు, పేలుడు పదార్థాలతో విధ్వంసానికి పాల్పడటం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడి కావడంతో, ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు తాజాగా మైనింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.








