- కర్ణాటక సీఎంగా డీకే
- మంత్రులుగా 13 మంది ప్రమాణ స్వీకారం
- సిద్దరామయ్య, ఖర్గే కుమారులకు మంత్రివర్గంలో దక్కిన చోటు
- హాజరైన రాహుల్, ఖర్గే, మాజీ సీఎం సిద్దరామయ్య, సీఎం రేవంత్ రెడ్డి
బెంగళూరు, మహా : కర్ణాటక రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం చాలా ప్రత్యేకంగా నిలిచింది. బుధవారం సాయంత్రం సరిగ్గా 4.10 గంటలకు బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఉన్న ప్రతిష్టాత్మకమైన గ్లాస్ హౌస్ ప్రమాణ స్వీకారానికి వేదికైంది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, డీకే శివకుమార్ చేత పదవీ ప్రమాణం చేయించారు. 71 ఏళ్ల శివకుమార్, తన చిరకాల కోరిక అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గత నెల మే 28వ తేదీన సిద్ద రామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఒప్పందం ప్రకారం శివకుమార్‌కు మార్గం సుగమమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన శివకుమార్ సమర్థతకు దక్కిన గుర్తింపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారు వీరే
శివకుమార్‌తోపాటు పాలనలో అనుభవం ఉన్న జీ పరమేశ్వరన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలు వారసత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు కేహెచ్ మునిపయ్య, కేజే జార్జ్, రామలింగారెడ్డి, ఎంపీ పాటిల్ వంటి సీనియర్ నేతలంతా శివకుమార్ కేబినెట్‌లో ఉన్నారు. కేహెచ్ మునియప్ప, కె.జె.జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యు.టి.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్‌కు మంత్రి పదవులు దక్కాయి.
రాజ్యాంగం చేతబూని ప్రమాణం
ప్రమాణ స్వీకార సమయంలో శివకుమార్ భారత రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకోవడం చర్చనీయాంశమైంది. చాలా కాలంగా కాంగ్రెస్ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రజల్లోకి వెళ్లోంది. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ గాంధీతోపాటు ఆ పార్టీ నేతలు పెట్టిన ప్రెస్‌మీట్‌లో దీని హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు శివకుమార్ కూడా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఏకంగా రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం చర్చకు దారితీసింది.
ఈ ప్రమాణ స్వీకారానికి జాతీయ స్థాయి నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు వచ్చి శివకుమార్‌కు శుభాకాంక్షలు చెప్పారు. పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న సిద్ధరామయ్య కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చి శివకుమార్‌ను ఆలింగనం చేసుకొని అభినందించారు.
ట్రబుల్ షూటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు
డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయం. క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకోవడంలో సంక్షోభాలను చక్కదిద్దడంలో ఆయన దిట్ట. అందుకే ఆయనను ట్రబుల్ షూటర్ అంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో ఆయన వ్యూహరచన కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు నేరుగా పాలన బాధ్యతలు చేపట్టడం ద్వారా తన కార్యదక్షతను నిరూపించుకోవడానికి అవకాశం దక్కింది.







