Mahaa Daily Exclusive

  నేటి నుంచే భూముల విలువల పెంపు….

Share

నేటి నుంచే భూముల విలువల పెంపు.
* శాస్త్రీయ అధ్యయనం మేరకే కొత్త ధరల నిర్ధారణ.
* అధికారికంగా ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
* సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి నూతన ధరలు అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా అడ్డగోలుగా భూముల ధరలను పెంచారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని, పక్కాగా శాస్త్రీయ అధ్యయనం మేరకే ఈ నూతన విలువలను నిర్ధారించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక, నిపుణుల సూచనల ఆధారంగా సామాన్యులకు భారం కాకుండా ఈ పెంపు ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాలు, మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా కొత్త ధరల నిర్ణయం జరిగింది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువకు, బహిరంగ మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని సరిచేసే దిశగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు.. ఇలా అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలపై ఈ పెంపు ప్రభావం పడనుంది. వాస్తవ పరిస్థితులను అనుసరించి ప్రాంతాన్ని బట్టి ఈ పెరుగుదల కనిష్ఠంగా ఐదు శాతం నుంచి గరిష్ఠంగా వంద శాతం వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న భూములు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని స్థలాల విలువల్లో గణనీయమైన మార్పులు ఉండనున్నాయి.
ధరల పెంపు నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ప్రజల రద్దీ విపరీతంగా పెరిగింది. పాత ధరలకే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు క్రయవిక్రయదారులు ఉదయం నుంచే కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మహేశ్వరం, గండిపేట, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, ఫరూఖ్ నగర్, సరూర్ నగర్ తదితర కీలక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల కోలాహలం నెలకొంది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. స్లాట్ బుకింగ్స్ సంఖ్యను పెంచడంతో పాటు, కార్యాలయాల పనివేళలను పొడిగించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిరంతరాయంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ భూముల విలువల సవరణకు సంబంధించిన డేటాను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల స్థాయిలో ఈ ఆన్‌లైన్ అప్‌డేషన్ దాదాపు తుది దశకు చేరుకుంది. రేపటి నుంచి కొత్త మార్గదర్శకాలు, నూతన మార్కెట్ విలువల ప్రకారమే ఆస్తుల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగనున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.