Mahaa Daily Exclusive

  తెలంగాణ మా భూమి పుత్రుల జాగీరే….

Share

తెలంగాణ మా భూమి పుత్రుల జాగీరే.
* పవన్ కల్యాణ్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.
* సచివాలయంలో కూర్చుని పెత్తనం చేస్తామంటే సహించం.
* పొట్టి శ్రీరాములు చేసింది ప్రాంతీయవాదం కాదా? మోదీది ఆర్థిక ప్రాంతీయవాదం కాదా?
*ఇంటికొస్తే బిర్యానీ పెడతాం.. కానీ మాపై ఆధిపత్యం ప్రదర్శిస్తే ఊరుకోం.
* పవన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
హైదరాబాద్, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ అహంకారపూరిత వ్యాఖ్యలకు తనదైన శైలిలో దీటైన కౌంటర్ ఇచ్చారు. అవును.. తెలంగాణ కచ్చితంగా ఈ భూమి పుత్రుల జాగీరేనని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. దశాబ్దాల పాటు ఈ నేల కోసం అలుపెరగని పోరాటాలు చేసినవాళ్లు, తమ ప్రాణాలను త్యాగాలు చేసినవాళ్లు, ఉద్యమంలో రక్తం చిందించిన అమరవీరులది ఈ తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ లాంటి వారు ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చని, తమ కుటుంబాలతో ప్రశాంతంగా జీవించవచ్చని.. ఇందుకు ఎవరూ అడ్డుచెప్పలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఏకంగా వచ్చి మా సచివాలయంలో కూర్చొని పెత్తనం చేస్తాం, మాపై ఆధిపత్యం చెలాయిస్తామంటే మాత్రం ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరని తేల్చిచెప్పారు.
ప్రాంతీయ భావోద్వేగాలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒక ప్రాంతంపై ఉన్న ప్రేమను ప్రాంతీయ విద్వేషంగా వక్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన చారిత్రక ఉద్యమం కూడా ప్రాంతీయ భావమే అవుతుందా అని పవన్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న సంధించారు. అదేవిధంగా, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను పక్కనబెట్టి కేవలం గుజరాత్‌కు మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టులు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మోదీ అనుసరిస్తున్న ఈ విధానం ‘ఆర్థిక ప్రాంతీయ భావం’ కాదా అని నిలదీశారు. తెలంగాణ గడ్డకు దేశభక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, నిజాం నిరంకుశ పాలనపై వీరోచిత పోరాటాలు చేసి స్వేచ్ఛను శ్వాసించిన నెత్తుటి నేల ఇదని కేటీఆర్ ఉద్ఘాటించారు.
ఒక నటుడిగా పవన్ కల్యాణ్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అభిమానిస్తారని, ఆదరిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన తమ ఇంటికి వస్తే ఎంతో ఆప్యాయంగా పసందైన హైదరాబాదీ బిర్యానీ పెట్టి పంపుతామని, కానీ తెలంగాణ రాజకీయాలపై పెత్తనం చేస్తామంటే మాత్రం సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉందని.. అలాగే తెలంగాణలో కూడా జనసేన పోటీ చేసుకోవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే, పార్టీ నడిపే ముందు ఇక్కడి ప్రజల భావోద్వేగాలు, వారు చేసిన త్యాగాల చరిత్రను పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పవన్‌కు హితవు పలికారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే అసలైన, ఏకైక నాయకుడు తమ పార్టీ అధినేత కేసీఆర్ గారేనని కేటీఆర్ ఈ సందర్భంగా సగర్వంగా ప్రకటించారు.