ఇన్-సర్వీస్ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వ తీపికబురు.
* ఏటా అదనంగా మరో రెండు ‘టెట్’ పరీక్షలు.
* సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేక ఏర్పాట్లు..
* విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ.
హైదరాబాద్, మహా.
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తూ, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) అర్హత సాధించని ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం ప్రతి ఏటా ప్రత్యేకంగా రెండు అదనపు టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఏటా షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెండు రెగ్యులర్ టెట్ పరీక్షలకు ఇవి పూర్తిగా అదనం. అంటే ఇకపై రాష్ట్రంలో ఏడాదికి మొత్తం నాలుగు టెట్ పరీక్షలు జరగనుండగా, అందులో రెండు కేవలం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసమే ఉద్దేశించినవి కావడం గమనార్హం.
ఈ కీలక నిర్ణయానికి సంబంధించి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఒక మెమోను విడుదల చేసింది. విద్యాశాఖ డైరెక్టర్, టెట్ చైర్మన్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పేరుతో అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి తదుపరి అవసరమైన అన్ని రకాల చర్యలు, ఏర్పాట్లను తక్షణమే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సైతం టెట్ అర్హత తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ ఉత్తీర్ణత సాధించని ఇన్-సర్వీస్ టీచర్లలో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో పదోన్నతులు పొందడానికి లేదా సర్వీసులో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి టెట్ అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయులకు ఈ అదనపు పరీక్షలు ఒక సువర్ణావకాశంగా మారనున్నాయి. సాధారణ అభ్యర్థులతో పోటీ పడే పని లేకుండా, కేవలం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా పరీక్షలు జరగడం వల్ల వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధమై అర్హత సాధించేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యాయ వర్గాల నుంచి ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.








