Mahaa Daily Exclusive

  ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్ గా యార్ర ప్రియాంక..

Share

*ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్ గా యార్ర ప్రియాంక*

*కొలువుతీరిన నూతన పాలకవర్గం.. బాధ్యతలు స్వీకరణ*

*రైతుల సమస్యల పరిష్కారం, మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా*

*మార్కెట్ చైర్పర్సన్ యార్ర ప్రియాంక*

మహా వరంగల్ బ్యూరో;

ఎట్టకేలకు మూడేండ్ల తర్వాత ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కొత్త పాలకవర్గం కొలువు తీరింది కొలువు దీరింది. బుధవారం ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్ గా యార్ర ప్రియాంక తో పాటు వైస్ చైర్మన్ బండి జనార్ధన్, కొందరు సభ్యులతో కలిసి ఆమె మార్కెట్ కు చేరుకున్నారు. ఉత్తర్వుల కాపీని ఇన్చార్జ్ కార్యదర్శి అయిన మల్లేశానికి అప్పగించారు. అనంతరం రిజిస్టర్ లో సంతకం చేసి పదవీ బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కు తనను చైర్పర్సన్ గా నియమించిన పార్టీ పెద్దలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
యార్ర ప్రియాంక కు చైర్పర్సన్ పదవి దక్కడంలో ఆమె భర్త అనిల్ కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీకి అనువాదకుడిగా పనిచేసిన అనిల్ పైరవీయే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితమే ప్రియాంక చైర్పర్సన్ గా పాలకవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక రాజకీయాల నేపథ్యంలో అప్పట్లో కమిటీ నియామకం వాయిదా పడిందని తిరిగి ఒక్కరి పేరు మార్పుతో పాత కమిటీనే ప్రభుత్వం తాజాగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతరం
చైర్పర్సన్ ప్రియాంక మాట్లాడుతూ

తాను రైతు బిడ్డను కాకపోయినా రైతుల సమస్యలను పూర్తిగా తెలుసుకుంటానని, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

*కొత్త పాలకవర్గం ముందు పాత సవాళ్లు*

వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు దాదాపు మూడేళ్లుగా పాలకవర్గం లేక పోవడంతో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు రాజ్య మేలు తున్నాయని అనేక ఆరోపణలు గత కొంతకాలంగా వినబడుతున్నాయి.
గత పాలకవర్గం కాలపరిమితి 2023 ఆగస్టు 16న ముగియడంతో అప్పటి నుంచి మార్కెట్ వ్యవహారాలు అధికారుల చేతుల మీదుగా సాగుతున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో మార్కెట్ అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్ లో జీరోదందా విచ్చలవిడిగా జరుగుతోందని, సూపర్వైజర్లు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అపవాదులు లేకపోలేదు. యార్డుల నిర్వహణ లోపాలు, రైతులకు అరకొర సౌకర్యాలు కొత్త పాలకవర్గానికి పాత సమస్యలే సవాల్‌గా మారనున్నాయని తెలుస్తోంది.
ముఖ్యంగా
నిలిచిన మార్కెట్ పనులు పండ్ల మార్కెట్ లేకపోవడంతో మార్కెట్ ఆదాయానికి భారీగానే గండిపడుతోంది. పాత గ్రెయిన్ మార్కెట్ లో అసంపూర్తిగా మిగిలిన మోడల్ మార్కెట్ నిర్మాణాలు వెక్కిరిస్తున్నాయి. ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం వరంగల్ బల్దియా ఆధీనంలోనే ఉంది. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడం తో నిర్మాణ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ లోనూ అడుగడుగునా సమస్యలు ప్రత్యక్ష మవుతున్నాయి. లక్షల రూపాయల మార్కెట్ ఫీజులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా బినామీల ఏరివేత కోసం ఐడీ కార్డులు జారీ చేస్తామన్న హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చడం లేదు. ఇవన్నీ సవాళ్లను అధిగమిస్తూ వీటి పై కొత్త పాలకవర్గం ఎలా దృష్టిసారిస్తుందో వేచి చూడాల్సిందే.