Mahaa Daily Exclusive

  సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు రక్షణ…

Share

సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు రక్షణ.
* ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.
*నాగచైతన్య పర్సనాలిటీ రైట్స్ కేసులో 24 గంటల్లో అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం.
* డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలపై ఉక్కుపాదం.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు అల్టిమేటం.
హైద్రాబాద్, మహా.
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అక్రమంగా వినియోగించుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగచైతన్య దాఖలు చేసిన ‘పర్సనాలిటీ రైట్స్’ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
**అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్‌లపై కోర్టు సీరియస్**
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అభ్యంతరకరమైన వీడియోలు సృష్టించడం పెరిగిపోయింది. కొన్ని పోర్న్ వెబ్‌సైట్లు సైతం వెబ్ ట్రాఫిక్ పెంచుకునేందుకు నాగచైతన్య పేరును, ఫొటోలను సెర్చ్ ట్యాగ్‌లుగా వాడుకుంటున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వైభవ్ కక్కర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన ఇమేజ్, వాయిస్, ఫొటోలను వాణిజ్య అవసరాల కోసం గానీ, తప్పుదోవ పట్టించేలా గానీ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలను ఇంటర్నెట్ నుంచి 24 గంటల్లోగా తొలగించాలని యూట్యూబ్, గూగుల్ సహా వివిధ ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. అలాగే ఆయన ఫొటోలతో అక్రమంగా మర్చండైజ్ (వస్తువుల అమ్మకం) వ్యాపారం చేస్తున్న వారిపై సైతం నిషేధం విధించింది.
**ట్రోలింగ్‌కు, విమర్శలకు తేడా ఉంటుంది**
ఈ విచారణ సందర్భంగా నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి, ప్రత్యేకించి మాజీ భార్య సమంతతో విడిపోవడంపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని న్యాయవాది ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కల్పిత కథనాలతో ప్రతిష్టను దిగజార్చేలా వీడియోలు చేస్తున్నారని, ఇది విమర్శ కాదని, ముమ్మాటికీ ఉద్దేశపూర్వక ‘ట్రోలింగ్’ అని వాదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. “ప్రజా జీవితంలో ఉన్న సెలబ్రిటీల పట్ల సాధారణ ప్రజల కంటే ఎక్కువ ఆసక్తి ఉండటం సహజమే అయినప్పటికీ, ఆ స్వేచ్ఛకు కచ్చితమైన పరిమితులు ఉంటాయని, హద్దులు దాటితే చర్యలు తప్పవని” కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.
**గతంలో నాగార్జునకు సైతం..**
ఓ సెలబ్రిటీ పేరు, వాయిస్, వ్యక్తిత్వాన్ని వారి అనుమతి లేకుండా వాడుకోకుండా ఉండేందుకు ఢిల్లీ హైకోర్టు ఈ రక్షణ కల్పించింది. కాగా, గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్ తదితర అగ్ర నటులు కూడా తమ పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయించి ఇలాంటి రక్షణను పొందారు. 2025 సెప్టెంబర్‌లో కింగ్ నాగార్జున సైతం తన డిజిటల్ భద్రతను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నుంచే ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం చైతూకి కూడా ఈ చట్టపరమైన విజయం దక్కడంతో టాలీవుడ్ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.