Mahaa Daily Exclusive

  థాయ్‌లాండ్ – హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు…

Share

థాయ్‌లాండ్ – హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు.
* ఏకంగా 300 మంది క్యారియర్లు.
* ఈగల్’ టీమ్ దెబ్బకు కుప్పకూలిన ఇంటర్నేషనల్ ముఠా సామ్రాజ్యం.
* మత్తు దందాలో వెలుగుచూస్తున్న కళ్లు చెదిరే నిజాలు.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరం వేదికగా నడుస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా డొంక కదులుతోంది. థాయ్‌లాండ్ కేంద్రంగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ. 12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి రాకెట్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణ ‘ఈగల్’ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. కేవలం మత్తు పదార్థాల పట్టివేతకే పరిమితం కాకుండా, ఈ దందా వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థలు పక్కాగా ఛేదించాయి.
పోలీసుల లోతైన దర్యాప్తులో ఊహించని నిజాలు బయటపడ్డాయి. థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించేందుకు ఈ స్మగ్లింగ్ ముఠా ఏకంగా 300 మందికి పైగా క్యారియర్లను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విమానాశ్రయాలు, ఇతర రవాణా మార్గాల్లోని భద్రతా వ్యవస్థల కళ్లుగప్పి, అత్యంత సులువుగా ఈ మత్తు పదార్థాలను నగరానికి చేరవేసేందుకు వీరంతా ఒక పకడ్బందీ వ్యవస్థగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ఒక్కొక్క క్యారియర్ ద్వారా అత్యంత రహస్యంగా డ్రగ్స్‌ను తరలిస్తూ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఏజెంట్లకు, పెడ్లర్లకు అప్పగించేలా ఈ అక్రమ నెట్‌వర్క్‌ను డిజైన్ చేశారు.
నెల రోజుల పాటు నిరంతర నిఘా, పక్కా టెక్నికల్ ఇంటెలిజెన్స్‌తో ‘ఈగల్’ టీమ్ ఈ ముఠా కదలికలను ట్రాక్ చేసింది. ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే సూత్రధారిగా భావిస్తున్న ఒక విదేశీ మహిళ సహా పది మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు, వారి ద్వారా ఈ 300 మంది క్యారియర్ల వివరాలను రాబట్టినట్లు సమాచారం. నగరంలోని యువతను, విద్యార్థులను, ఐటీ ఉద్యోగులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఈ సిండికేట్ మూలాలను పెకిలించేందుకు అధికారులు తమ దర్యాప్తును ఉద్ధృతం చేశారు.
ప్రస్తుతం అరెస్టయిన నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా ఈ 300 మంది క్యారియర్లు ఎవరు, వీరికి స్థానికంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఎవరు అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా కూపీ లాగుతున్నారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టేందుకు ఈగల్ బృందాలు సిద్ధమయ్యాయి. ఈ కేసు విచారణ కొనసాగుతున్న కొద్దీ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాత్మక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.