Mahaa Daily Exclusive

  రద్దయిన వెయ్యి నోటుతో కేసీఆర్‌ సమానం…

Share

రద్దయిన వెయ్యి నోటుతో కేసీఆర్‌ సమానం.
* బీఆర్‌ఎస్‌ పార్టీకి గతమే తప్ప భవిష్యత్తు లేదు.
* కేసీఆర్‌ అంటే నీళ్లు కాదు.. సారా.. సోడా.
* కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాల పెంపు.
*పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేసి తీరుతాం.
* సీఎం రేవంత్ రెడ్డి.

మహబూబ్‌నగర్,మహా.

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చలామణిలో లేని రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వారని ముఖ్యమంత్రి అభివర్ణించారు.రద్దయిన నోటు జేబులో ఉంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయే తప్ప ఎలాంటి లాభం ఉండదని, అలాగే బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు కేవలం గతం మాత్రమే ఉందని, భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) పనులను పరిశీలించిన అనంతరం శుక్రవారం భూత్పూర్ మండలం కొత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యవహారశైలిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు.తెలంగాణ ప్రజలకు కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తారని ఆశిస్తే.. కేసీఆర్ అంటే నీళ్లు కాదు, సారా.. సోడా అని ప్రజలు నమ్మే పరిస్థితిని తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన సొంతంగా డిజైన్ చేసి మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో పూర్తి కాలేదని, పాత ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
పాలమూరు జిల్లా కరువు తీర్చాలనే కనీస చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి లేకపోయిందని, ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకోవడంపైనే వారు దృష్టి పెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు.తమ పదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, అందులో దాదాపు లక్ష కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే వెచ్చించి పాలమూరు ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. కనీసం భూసేకరణ చేయకుండా, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా కేవలం పంపులు, లిఫ్టుల కొనుగోలు కోసమే రూ.27,000 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. పంపులు, లిఫ్టుల సామర్థ్యాన్ని అమాంతం పెంచి ప్రాజెక్టు అంచనాలను ఒకేసారి పది వేల కోట్లు పెంచడం ద్వారా ఎవరి ఇంట్లో కనకవర్షం కురిసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేసీఆర్ వ్యవహరించిన తీరు, పెట్టిన సంతకాల వల్లే ఇప్పుడు ఏపీకి అది ఒక బలమైన ఆయుధంగా మారిందని, తద్వారా పాలమూరుకు దక్కాల్సిన 90 టీఎంసీల నీరు రాకుండా పోయిందని వివరించారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి తీరుతుందని రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులన్నింటినీ రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముప్పై నెలల కాలంలోనే కాంట్రాక్టర్లకు రూ.22,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని, అందులో రూ.8,000 కోట్లు ప్రత్యేకంగా పాలమూరు ప్రాజెక్టుల కోసమే విడుదల చేశామని ఆయన వెల్లడించారు.జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులతో పాటు పాలమూరు ఎత్తిపోతలను సకాలంలో పూర్తి చేసి ఉంటే జిల్లాలోని 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించి రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.విలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జడ్చర్ల మండలంలోని ఉద్ధండాపూర్‌‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.