Mahaa Daily Exclusive

  భూ విలువల పెంపు అశాస్త్రీయం….

Share

భూ విలువల పెంపు అశాస్త్రీయం..
* సామాన్యుడిపై మోయలేని భారం!.
* ఖజానా నింపుకునేందుకే కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధ్వజం.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయత లేకుండా భూముల మార్కెట్ విలువలను పెంచడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను దూరం చేసేలా ఉందని ఆయన మండిపడ్డారు. రైతులు, భూయజమానులకు లబ్ధి చేకూరడాన్ని బీజేపీ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని, అయితే ప్రస్తుత మార్కెట్ విలువల పెంపు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు మేలు చేయడం కాదని, కేవలం రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ఖజానా నింపుకోవడమేనని ఆయన విమర్శించారు. జూన్ 5న ఆయన ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి నెడుతోందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. భూముల విలువలను 50 శాతం నుంచి 100 శాతం వరకు, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 శాతానికి పైగా పెంచడం దారుణమన్నారు. దీనివల్ల సామాన్యుడు చిన్న స్థలం కొని ఇల్లు కట్టుకోవాలన్నా లక్షలాది రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజులు అదనంగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం కనీస ధరను రూ. 2.75 లక్షలుగా, మున్సిపాలిటీల్లో రూ. 5 లక్షలుగా, హెచ్‌ఎండీఏ పరిధిలో ఏకంగా రూ. 10 లక్షలుగా నిర్ధారించి మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని దుయ్యబట్టారు. దీనికి తోడు, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని పాత ధరల ప్రకారం చలాన్లు చెల్లించిన వారికి కూడా పెంచిన ధరలనే వర్తింపజేస్తామని చెప్పడం ఈ ప్రభుత్వ నిరంకుశత్వానికి, మొండివైఖరికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, గడచిన కొద్ది నెలలుగా వరుసగా చార్జీల మోత మోగిస్తూ సామాన్యుల నడుం విరుస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే కరెంట్ బిల్లులు, ఆర్టీసీ బస్సు చార్జీలు, మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్నులు, మంచినీటి చార్జీలను విపరీతంగా పెంచడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కొత్త లూటీకి తెరలేపారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన భూముల మార్కెట్ విలువల వల్ల పడే రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని సమీక్షించాలని, అలాగే విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, సామాన్య ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.