Mahaa Daily Exclusive

  వీరాభిమాని సత్యనారాయణ కోరికను తీర్చిన సీఎం చంద్రబాబు….

Share

వీరాభిమాని కోరికను తీర్చిన సీఎం చంద్రబాబు.
* ఆచంట వృద్ధుడి వీడియోపై స్పందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి.
* సిద్ధాంతం’ సభ ముగిశాక ప్రత్యేకంగా తన బస్సులోకి పిలిపించుకుని ఆత్మీయ సంభాషణ.
* అభిమాని కుమారుడికి ఉచిత వైద్యం..
* ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశం.
సిద్ధాంతం,మహా.
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వేదికగా సోమవారం జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ బహిరంగ సభ ఒక వీరాభిమాని జీవితంలో మరచిపోలేని మధుర అనుభూతిని మిగిల్చింది. తనను కలవాలన్న ఆచంటకు చెందిన వృద్ధుడు, వీరాభిమాని సత్యనారాయణ కోరికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ఆత్మీయంగా నెరవేర్చారు. గతంలో సత్యనారాయణకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దానిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ‘సిద్ధాంతం’ వేదికపై కలుద్దామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సభ ముగిసిన వెంటనే చంద్రబాబు తన మాటను నిలబెట్టుకుంటూ సత్యనారాయణను ప్రత్యేకంగా తన పర్యటన బస్సులోకి పిలిపించుకున్నారు.
ఆచంట నుంచి వచ్చిన తన వీరాభిమానితో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సేపు ఆత్మీయంగా ముచ్చటించారు. వృద్ధుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ.. ఆయన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ తన ఇంట్లోని బాధను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి అవసరమైన వైద్యసాయం అందించి ఆదుకోవాలని, అలాగే తమ గ్రామానికి డ్రైనేజీ సదుపాయం కల్పించి సమస్యను పరిష్కరించాలని ఆయన సీఎంను చేతులు జోడించి వేడుకున్నారు.
అభిమాని విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. సత్యనారాయణ కుమారుడికి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం చేయిస్తామని, ఆ బాధ్యత తనదని కొండంత భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, సత్యనారాయణ కుటుంబ పరిస్థితిని గమనించి ఆయనకు తక్షణమే ఒక పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాల్సిందిగా వేదికపైనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం తనను పిలిచి మాట్లాడటమే కాకుండా, తన కుటుంబ కష్టాలను తీరుస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల సత్యనారాయణ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు నివేదించారు. ఈ ఆత్మీయ కలయిక సభా ప్రాంగణానికి తరలివచ్చిన జనసందోహాన్ని ఎంతగానో ఆకట్టుకుంది.