Mahaa Daily Exclusive

  అంతరిక్షంలో పాక్ ‘నిఘా’ నెట్‌వర్క్….

Share

అంతరిక్షంలో పాక్ ‘నిఘా’ నెట్‌వర్క్.
* చైనా అండతో భారత్‌పై డేగకన్ను.
*గత 16 నెలల్లోనే ఆరు నిఘా ఉపగ్రహాల ప్రయోగం.
* కశ్మీర్ సరిహద్దులు, వ్యూహాత్మక స్థావరాలే లక్ష్యంగా డ్రాగన్-పాక్ వ్యూహం.
* దీటుగా స్పందించిన భారత్.. రూ.27,000 కోట్లతో 52 ఉపగ్రహాల మెగా గ్రిడ్ సిద్ధం.

ఢిల్లీ, మహా.

అంతరిక్ష రంగంలో పొరుగు దేశం పాకిస్థాన్ అత్యంత వేగంగా అడుగులు వేస్తూ, భారత సరిహద్దులపై నిఘా పెట్టేందుకు తన అంతరిక్ష సామర్థ్యాన్ని అనూహ్యంగా విస్తరిస్తోంది. చైనా దేశ సాంకేతిక, ఆర్థిక అండదండలతో పాకిస్థాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ గత 16 నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 6 అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ (భూ పరిశీలన) ఉపగ్రహాలను నింగిలోకి పంపడం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత భూభాగాలు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాలతో పాటు హిందూ మహాసముద్రంలో భారత నావికాదళ కదలికలపై నిరంతర నిఘా ఉంచడమే లక్ష్యంగా పాక్ ఈ ప్రయోగాలు చేపట్టినట్లు ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ‘ది ప్రింట్’ తన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది.
**ప్రతి 48 గంటలకోసారి భారత సరిహద్దులపై నిఘా..**
గత 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ మధ్య కాలంలో పాకిస్థాన్ వరుసగా పౌశాట్-1 పిఆర్‌ఎస్‌సి-ఇఓ1, ఇఓ2, ఇఓ3, పిఆర్‌ఎస్‌ఎస్-2, హెచ్‌ఎస్-1 వంటి కీలక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వీటిలో మెజారిటీ ఉపగ్రహాలను చైనాకు చెందిన జియుక్వాన్, తైయువాన్ ప్రయోగ కేంద్రాల నుంచి చైనా లాంగ్ మార్చ్ రాకెట్ల ద్వారా కక్ష్యలోకి పంపారు. సన్-సింక్రోనస్ కక్ష్యలలో తిరిగే ఈ ఉపగ్రహాలు ప్రతి రెండు రోజులకు (48 గంటలకు) ఒకసారి భారత భూభాగంలోని అత్యంత సున్నితమైన రక్షణ ప్రాంతాలను స్పష్టంగా చిత్రించగలవని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి పౌర అవసరాల కోసమే ఈ ఉపగ్రహాలని పాక్ పైకి చెబుతున్నప్పటికీ.. భారత సైనిక కదలికలను గుర్తించడం, క్షేత్రస్థాయిలోని రహస్య ఆస్తులను పసిగట్టడమే వీటి అసలు ఉద్దేశమని స్పష్టమవుతోంది.
**చైనా ‘స్పేస్’ ఇంటెలిజెన్స్ విస్తరణ**
వీటన్నింటిలో ‘ పి ఆర్ ఎస్ సి- ఈ ఓ త్రీ’ అనే శక్తివంతమైన ఎలక్ట్రో-ఆప్టికల్ ఉపగ్రహాన్ని భారత్, పాకిస్థాన్, కశ్మీర్ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేలా ఒక ప్రత్యేకమైన కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు అమెరికాకు చెందిన స్పేస్ అనలిటిక్స్ సంస్థ ‘కామ్‌స్పాక్ గుర్తించింది. 1961లో ఏర్పాటైన పాక్ అంతరిక్ష సంస్థ సుపార్కో.. ఇప్పటివరకు తన సుదీర్ఘ చరిత్రలో కేవలం 15 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగా, అందులో 6 ఉపగ్రహాలను కేవలం ఈ 16 నెలల్లోనే ప్రయోగించడం గమనార్హం. చైనా ఇప్పటికే తన స్వంత ఉపగ్రహాల ద్వారా భారత్‌పై నిఘా పెడుతోందని, ఇప్పుడు పాకిస్థాన్ అంతరిక్ష విభాగాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుని త్రైపాక్షిక వ్యూహంతో భారత రక్షణ రంగానికి సవాలు విసురుతోందని ఇస్రో మాజీ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
**’ఫేజ్-3’ గ్రిడ్‌తో భారత్ భీకర వ్యూహం.. రూ.27,000 కోట్లతో 52 ఉపగ్రహాలు!**
చైనా, పాకిస్థాన్‌ల ఉమ్మడి అంతరిక్ష సవాలును తిప్పికొట్టేందుకు భారతదేశం సైతం అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్ III’ ప్రాజెక్టు కింద ఏకంగా రూ.26,968 కోట్ల (సుమారు 27వేల కోట్ల) భారీ బడ్జెట్‌తో 52 సరికొత్త నిఘా ఉపగ్రహాల కూటమిని (కాన్‌స్టెల్లేషన్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. 2025 నుంచి ప్రారంభమై 2029 నాటికి పూర్తి కానున్న ఈ మెగా ప్రాజెక్టులో.. 21 ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వయంగా అభివృద్ధి చేస్తుండగా, మిగిలిన 31 ఉపగ్రహాలను దేశీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు.
ఈ 52 ఉపగ్రహాల కూటమి ద్వారా చైనా, పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతంపై భారత్ పూర్తి స్థాయి ‘డేగకన్ను’ వేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటం ఎన్‌క్రిప్షన్, సింథటిక్ అపెర్చర్ రాడార్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఉపగ్రహాలు.. ఎంతటి దట్టమైన మేఘాలు ఉన్నా, చీకటిగా ఉన్నా సరే శత్రుదేశాల కదలికలను, మొబైల్ క్షిపణి వ్యవస్థల మోహరింపును క్షణాల వ్యవధిలో 24 గంటలూ రికార్డ్ చేసి భారత కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిస్తాయి. శత్రువుల నిఘా నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేస్తూ అంతరిక్షంలో భారత రక్షణ ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక ‘బాడీగార్డ్ శాటిలైట్ల’ను కూడా భారత్ సిద్ధం చేస్తుండటం విశేషం. దీనితో అంతరిక్ష యుద్ధ తంత్రంలోనూ టీమిండియా తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు సన్నద్ధమైంది.