Mahaa Daily Exclusive

  దీదీకి మరో ఎదురుదెబ్బ….

Share

  • దీదీకి మరో ఎదురుదెబ్బ
  • రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామ చేసిన సుష్మితాదేవ్
  • అంతకు ముందు అసోం సీఎంతో భేటీ

కోల్ కత్తా, మహా : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటున్న మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుఖేందు శేఖర్‌ బాటలోనే బుధవారం మరో రాజ్యసభ ఎంపీ సుష్మితాదేవ్‌ రాజీనామా చేయడంతో పార్టీ మరింత సంక్షోభంలో పడింది. తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్​ సీ.పీ. రాధాకృష్ణన్​కు సమర్పించారు. మమతాబెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ దిల్లీలో ఇండియా కూటమి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న వేళ ఈ పరిణామం జరిగింది. రాజీనామా నిర్ణయానికి ముందు అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో సుష్మితాదేవ్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సుష్మితా తన రాజీనామా లేఖలో “నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దీనిని తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. రాజ్యసభ సభ్యురాలిగా నా పదవీకాలంలో నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సచివాలయ అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని రాసుకొచ్చారు. టీఎంసీ నుంచి గానీ, కాంగ్రెస్‌ నుంచి గానీ ఇక అసోం రాజకీయాల్లో తాను కొనసాగలేనని మమతాకు ఆమె వివరించినట్లు సమాచారం. అయితే ఆమె బీజేపీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీలో చేరడానికి ముందు సుష్మితాదేవ్​ కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆమె తండ్రి, దివంగత సంతోశ్​ మోహన్ దేవ్, యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ఈనెల 8 న రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్లమెంటు ఎగువ సభ సభ్యత్వానికి, అలాగే టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాలో, ఇటీవల ముగిసిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైనందుకు రాయ్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ’15 ఏళ్ల అరాచక పాలన ఫలితమే ఈ తీర్పు’ అని ఆయన అభివర్ణించారు. సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు చేయడంతో టీఎంసీలో చీలిక ఏర్పడిందనే ఊహాగానాల మధ్య ఈ వరుస రాజీనామాలు జరిగాయి. మరోవైపు, 20 మంది ఎంపీల వర్గం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్ల కోసం లోక్‌సభ స్పీకర్‌ను అభ్యర్థించినట్లు రెబెల్ టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పేర్కొన్నారు. “ప్రత్యేక సీటింగ్ కేటాయించాలని 20 మంది ఎంపీలు కలిసి స్పీకర్‌ను అభ్యర్థించాం. బంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం” అని ఆమె అన్నారు. ఇక, కేంద్ర మంత్రి, బీజేపీ బంగాల్ ఎన్నికల ఇన్‌ఛార్జి భూపేందర్ యాదవ్, ముఖ్యమంత్రి సువేందు అధికారిలతో తిరుగుబాటు ఎంపీలు సమావేశం కావడం, ఆ వర్గం ఎన్‌డీఏలో విలీనం అవుతుందనే ఊహాగానాలకు దారితీసింది.