Mahaa Daily Exclusive

  దీదీకి మరో గట్టి షాక్‌….

Share

దీదీకి మరో గట్టి షాక్‌..
* టీఎంసీ రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా.
* నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎంపీల గుడ్‌బై.
* తృణమూల్‌లో తీవ్ర సంక్షోభం.

కోల్‌కతా,మహా.

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అసమ్మతి జ్వాలలు గుప్పుమంటున్నాయి. ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరైక్ గురువారం తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తృణమూల్‌కు గుడ్‌బై చెప్పిన మూడో రాజ్యసభ సభ్యుడు ఈయనే కావడం గమనార్హం. ఈ వరుస పరిణామాలు టీఎంసీలో అంతర్గతంగా చెలరేగుతున్న తీవ్ర సంక్షోభాన్ని కళ్ళకు కడుతున్నాయి.
గురువారం ఉదయం ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను స్వయంగా కలిసిన ప్రకాశ్ చిక్.. తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, తాను పదవిని వీడటానికి గల రాజకీయ కారణాలను ఆయన ప్రస్తుతానికి బహిర్గతం చేయలేదు. కేవలం రాజ్యసభ సభ్యత్వానికే రాజీనామా చేశారా లేక పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ప్రకాశ్ చిక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నిజానికి ఇదే వారంలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీలో ఇది మూడో రాజీనామా కావడం అధిష్ఠానాన్ని కలవరపెడుతోంది. జూన్ 8వ తేదీన పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న మరో మహిళా ఎంపీ సుస్మితా దేవ్ సైతం పార్టీకి, ఎంపీ పదవికి వీడ్కోలు పలికారు. ఆమె బుధవారం ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ప్రత్యేకంగా భేటీ కావడంతో త్వరలోనే ఆమె బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తాజాగా రాజీనామా చేసిన ప్రకాశ్ చిక్ బరైక్.. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందారు. 2023లో ఆయన తృణమూల్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్‌లోని ఒక కీలక నియోజకవర్గం నుంచి ఆయన్ను బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం భావించినప్పటికీ, చివరి నిమిషంలో అది సాధ్యపడలేదు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పార్లమెంటరీ పక్షంలో మొదలైన ఈ వరుస రాజీనామాల పర్వం టీఎంసీ అగ్రనాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల సంయుక్త నాయకత్వంపై, పార్టీ నడుస్తున్న తీరుపై సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి, సందేహాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.