ఖమ్మం బాలికకు పూర్తి ఉచిత వైద్యం.
*విషమ స్థితిలో వస్తే తక్షణ చికిత్స.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం.
*ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మందులు, భోజనం తదితర సదుపాయాలు.
*నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడి.
హైదరాబాద్, మహా.
తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలికకు హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తోంది. ఆ బాలికకు ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద పూర్తి ఉచితంగా మెరుగైన చికిత్స అందిస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. అత్యంత విషమ పరిస్థితిలో (సీరియస్ కండిషన్) బాలికను నిమ్స్‌కు తీసుకువచ్చిన వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది, ఆమెను ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసి తక్షణమే అవసరమైన అత్యవసర చికిత్సను ప్రారంభించారని ఆయన వివరించారు.
ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిరంతరాయంగా చికిత్స అందిస్తోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పూర్తిగా నిలకడగా (స్టేబుల్) ఉందని డైరెక్టర్ స్పష్టం చేశారు. వైద్య పరీక్షల్లో భాగంగా అత్యంత ఖరీదైన సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లతో పాటు వ్యాధి నిర్ధారణకు అవసరమైన అన్ని రకాల రక్త పరీక్షలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా నిర్వహించామని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.
బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఆందోళనలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఒక గదిని సైతం కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఆసుపత్రి యాజమాన్యం కల్పిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే వైద్యం, ఖరీదైన మందులు (మెడిసిన్), మరియు భోజన సదుపాయం.. ఇలా ప్రతిదీ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నామని, బాధిత కుటుంబం ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిమ్స్ డైరెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.








