Mahaa Daily Exclusive

  పాస్‌పోర్ట్ సేవల్లో ది బెస్ట్ పోలీస్………

Share

  • పాస్‌పోర్ట్ సేవల్లో ది బెస్ట్ పోలీస్
  • తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు
  • ఉత్తమ పోలీసు ధృవీకరణ సేవలకు ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’
  • డీజీపీ సి.వి. ఆనంద్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆహ్వానం
  • 19 న అవార్డ్ ను అందుకోనున్న డీజీపీ

 

హైదరాబాద్, మహా : పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. 2025-26 సంవత్సరంలో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణలో విశిష్ట సేవలు అందించిన రాష్ట్ర పోలీసు సంస్థగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేస్తూ ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు అవార్డును ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ & చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బి.ఎస్. ముబారక్ డీజీపీ సి.వి. ఆనంద్ కు అధికారిక లేఖ పంపారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహించే పాస్ పోర్ట్ సేవ సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది పాస్‌పోర్ట్ సేవా దివస్ మరియు పాస్‌పోర్ట్ అధికారుల సదస్సు జూన్ 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ భవన్‌లో నిర్వహించనున్నారు. న్యూ ఢిల్లీ లో జూన్ 19న జరిగే కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డిజిపి ఆనంద్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు.

 

పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసు ధృవీకరణ అత్యంత కీలకమైన అంశమని, ఈ విభాగంలో తెలంగాణ పోలీసులు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు దక్కిందని డిజిపి పేర్కొన్నారు. అలాగే పాస్‌పోర్ట్ సేవా దివస్‌లో భాగంగా నిర్వహించే హై-లెవల్ సెగ్మెంట్ కార్యక్రమానికి డీజీపీ ఆనంద్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆయన హాజరు కార్యక్రమ విజయానికి దోహదపడుతుందని పేర్కొంది. రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన సాంకేతిక ఆధారిత పోలీసు ధృవీకరణ విధానం, వేగవంతమైన సేవలందింపు, ప్రజా కేంద్రిత దృక్పథం వల్లే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని డిజిపి తెలిపారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసుల సేవా నిబద్ధతకు, వృత్తిపరమైన నైపుణ్యానికి మరో నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పురస్కారం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.