Mahaa Daily Exclusive

  టెండర్లలో రూ.3 వేల కోట్ల కుంభకోణం….

Share

  • టెండర్లలో రూ.3 వేల కోట్ల కుంభకోణం.
  • లెక్కలతో సహా బయటపెడతా.
  • ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.

హైదరాబాద్:మహా.

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై సీనియర్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ టెండర్ల వ్యవహారంలో సుమారు రూ.3,000 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర మంత్రుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. వారికి కనీసం అంకెకు, సంఖ్యకు మధ్య ఉన్న తేడా కూడా తెలియని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. టెండర్ల పేరిట జరిగిన ఈ ప్రజాధనం దోపిడీని త్వరలోనే లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచుతానని, పక్కా ఆధారాలతో ఈ కుంభకోణాన్ని బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను మూటలు కట్టి ఢిల్లీ పెద్దలకు మోస్తున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి నిధులు తరలించేందుకు సంచులన్నీ అక్కడే వాడుతుండటం వల్లే, పాపం రాష్ట్రంలోని రైతులకు ధాన్యం నింపుకునేందుకు కనీసం గోనె సంచులు (గన్నీ బ్యాగ్‌లు) కూడా దొరకడం లేదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతుల కష్టాలను గాలికొదిలేసి కేవలం ఢిల్లీ నాయకులను మెప్పించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి గోనె సంచుల కొరతే నిదర్శనమన్నారు.

తెలంగాణ వనరులను, నిధులను ఉద్దేశపూర్వకంగా స్థానికేతరులకు దోచిపెడుతున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొడుతూ, ఇక్కడి ఉపాధి, వ్యాపార అవకాశాలను ఇతర రాష్ట్రాల వారికి కట్టబెడుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు దక్కాల్సిన కాంట్రాక్టులను, టెండర్లను తెలంగాణేతరులకు అప్పగించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మన బిడ్డల హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడతామని ఆయన హెచ్చరించారు.