ఓట్లు చోరీ చేసి.. ఇప్పుడు సీట్లు కొల్లగొడుతున్నారు!
*బీజేపీ ఫాసిస్టు విధానాలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు.
* మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో పీఎంవో కుట్ర.
* ఆర్వోను ఉరితీసినా తప్పులేదు!
* మహిళలను చులకన చేస్తూ మాట్లాడిన షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు.
* నా వ్యక్తిత్వం ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు.
* కేటీఆర్ కంటే హరీష్ రావుకే నా క్యారెక్టర్ బాగా తెలుసు.
* గాంధీ భవన్‌లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ ‘చిట్ చాట్’.
హైదరాబాద్, మహా.
ఓట్లు చోరీ చేసిన కమలనాథులు ఇప్పుడు ఏకంగా సీట్లను సైతం కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నేరుగా జోక్యం చేసుకుందని, ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మారి నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారిని (ఆర్వో) ఉరితీసినా తప్పులేదంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో శనివారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టి (చిట్ చాట్)లో ఆయన పలు కీలక అంశాలపై కుండబద్దలు కొట్టారు. గాంధేయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో బీజేపీ కుట్రలను ఎండగట్టడంతో పాటు.. సొంత పార్టీ నేత షబ్బీర్ అలీ ఆరోపణలకు సుదీర్ఘ పత్రికా రంగంలో ఉన్న వారికి సైతం ఆసక్తి కలిగించేలా ఘాటైన రాజకీయ కౌంటర్ ఇచ్చారు.
రాజ్యసభలో బలం పెంచుకోవాలన్న ఏకైక దుర్బుద్ధితో కాషాయ పార్టీ ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? లేక నియంత పాలన నడుస్తోందా? అన్న తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కనీస కేసు కూడా లేనప్పటికీ కేవలం ఓ పసలేని నోటీసును సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నేరుగా జోక్యం చేసుకుని ఈ కేసును పక్కదారి పట్టించిందని, రాజకీయ ఒత్తిళ్లతో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) తన ఆఫీసులో కూర్చుని ప్రధాని చేతిలో కీలుబొమ్మగా, ఓ నియంతలా వ్యవహరించారని దుయ్యబట్టారు. నామినేషన్ తిరస్కరించే అధికారం లేకపోయినా పక్షపాతంగా వ్యవహరించిన సదరు ఆర్వోను ఉరితీసినా తప్పులేదంటూ ఆయన తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో సైతం న్యాయం దక్కకపోవడం, 24 గంటలు గడుస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కనీసం స్పందించకపోవడం దేశ దౌర్భాగ్యమన్నారు.
నిఖార్సైన నిజాయితీకి నిలువుటద్దం లాంటి తన సోదరి మీనాక్షి నటరాజన్‌ను బీజేపీ బలిపశువును చేసిందని టీపీసీసీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ సానుభూతి తెలుపుతుండటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బెంగాల్, మహారాష్ట్రల్లో బీజేపీ ఏ విధమైన రాజకీయ వికృత క్రీడకు తెరతీసిందో యావత్ దేశ ప్రజలు గమనించారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహా ఫాసిస్టు విధానాలను అవలంబించి ఉంటే, నేడు నరేంద్ర మోదీ కనీసం ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయ్యేవారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పన్నెండేళ్లలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని, ఓట్లు చోరీ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా సీట్లను కూడా చోరీ చేస్తూ రాజ్యాంగాన్ని అత్యంత దుర్మార్గంగా అవమానిస్తోందని విమర్శించారు. ఒక దేశ ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలపైనా మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ.. మహిళలను చులకన చేస్తూ మాట్లాడటం విచారకరమని, ఆయన స్థాయికి ఆ మాటలు తగవని మండిపడ్డారు. ఏడాది క్రితం మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటపెట్టడం వెనుక ఉన్న లీకు వీరులు, గ్రీకు వీరుల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమగ్ర విచారణ జరుపుతున్నారని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ ఆరోపణలపై తాను తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని, తన ఆస్తులు, తన వ్యక్తిత్వం, తన నిఖార్సైన ప్రస్థానం ఏంటో నిజామాబాద్ ప్రజలకు అణువణువూ తెలుసునని ఆయన ఉద్ఘాటించారు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేర్పించింది షబ్బీర్ అలీనే అని గుర్తుచేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఇప్పటికే షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినా, వాటిని సాకుగా చూపి కుట్రలకు పాల్పడటం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి బురదజల్లడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా టీపీసీసీ చీఫ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మీనాక్షి నటరాజన్‌కు జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన కేటీఆర్, దాన్ని వదిలేసి సంబంధం లేని రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ క్యారెక్టర్ ఏంటో కేటీఆర్ కంటే, మాజీ మంత్రి హరీష్ రావుకే చాలా స్పష్టంగా, సంపూర్ణంగా తెలుసునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తుల కుట్రలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.








