Mahaa Daily Exclusive

  మెట్రో విస్తరణపై కేంద్రం మొండివైఖరి…

Share

మెట్రో విస్తరణపై కేంద్రం మొండివైఖరి.
* కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.
* హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అడ్డంకులు.
* కేంద్రం సహకరించకపోతే ఎన్‌ఓసీ ఇవ్వండి.
* రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బీజేపీ ఎంపీలు.
* నిధుల బదిలీని ఎందుకు అడ్డుకుంటున్నారు?
* ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.
* కేంద్రం నుంచి ఆశించిన సహకారం కరువు.
* కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకారం.
* మెట్రో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జంట నగరాల ప్రజలతో పాటు సియుఆర్ఇ పరిధిలోని నివాసితులకు తమ నిబద్ధతను తెలియజేశారు. ఒక అంతర్జాతీయ నగరానికి ఉండాల్సిన ప్రమాణాలతో మెట్రో రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి చొరవతో మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కిందని గుర్తుచేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి దశ మెట్రో కోసం ఒప్పందాలు పూర్తయ్యాయని, 2017 నాటికే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చారిత్రక కట్టడాల సాకుతో ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్ల మెట్రో మొదటి దశ మూడేళ్ల పాటు జాప్యానికి గురైందని, దీనివల్ల 15 వేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం 22 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల గురించి ఆలోచించే తీరిక లేదని, కేవలం తమ ఆస్తులను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. పదేళ్ల కాలంలో గత ప్రభుత్వం మెట్రో విస్తరణ గురించి కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడంతోనే హైదరాబాద్ మెట్రో సేవలు ప్రపంచస్థాయిలో 9వ స్థానానికి పడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.
మెట్రో ఫేజ్-2 కోసం తాము ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని, అయితే ఫేజ్-1 నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థతోనే రెండో దశను కూడా చేపట్టాలని కేంద్రం నిబంధన విధించిందని సీఎం వివరించారు. కానీ గత నష్టాలతో సతమతమవుతున్న ఎల్ అండ్ టీ సంస్థ ఫేజ్-2 నిర్మాణానికి అంగీకరించలేదని, ఏటా 400 కోట్ల రూపాయల నష్టాన్ని తాము భరించలేమని స్పష్టం చేసిందని తెలిపారు. దీనివ్యాప్తంగానే ప్రజల సౌకర్యార్థం 30 వేల కోట్ల రూపాయల విలువైన ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లకే కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఎల్ అండ్ టీ మెట్రోపై ఉన్న 13,600 కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అయితే ఈ ప్రక్రియలో కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కెసీఆర్ హయాంలో పిఎఫ్ సి, ఆర్ ఈ సి ద్వారా ఎటువంటి గ్యారెంటీ లేకుండా, మూడో కంటికి తెలియకుండానే కేంద్రం 3 లక్షల 15 వేల కోట్ల రూపాయల అప్పును 9 నుంచి 11.5 శాతం వడ్డీతో ఇచ్చిందని, కానీ తమ ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా 4 శాతం వడ్డీకే జపాన్ సంస్థ నుంచి రుణం తెస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మే 20న ఖట్టర్ ను, 21న అశ్విని వైష్ణవ్ ను కలిసి ఈ నిధులు ఇవ్వవద్దని కిషన్ రెడ్డి కోరారని, దీనివల్లనే తాము ఆయన్ను నిలదీయాల్సి వస్తుందని అన్నారు. జపాన్ సంస్థ ఇప్పటికే ఐఆర్‌ఎఫ్‌సీకి నిధులను విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కాకుండా అడ్డుకోవడం వల్ల వడ్డీ భారం పెరుగుతోందని, దీనికి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని సీఎం సవాల్ విసిరారు. మీకు భాగస్వామ్యం ఇష్టం లేకపోతే ఎన్‌ఓసీ ఇవ్వండి, మేమే సొంతంగా మెట్రో విస్తరణ పూర్తి చేసుకుంటామని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉండి సొంత ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొంటూ, కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని, ఆయన కుట్రలకు కేంద్ర మంత్రి సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.