- తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం
- రూ. 75 వేల వరకు ఉన్న రైతులకు రుణ మాఫీ
- 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి
- ఖజానాపై రూ. 5,932.23 కోట్ల అదనపు భారం
- అయిదెకరాల భూమి ఉన్న రైతులకూ వర్తింప చేయాలన్న మాజీ సీఎం పళనిస్వామి
చెన్నై, మహా : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్నదాతలకు భారీ ఊరటనిస్తూ సహకార రంగంలో రూ.75,000 వరకు వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వ ఖజానాపై రూ.5,932.23 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ముఖ్యమంత్రి విజయ్ మే 25న విడుదల చేసిన తొలి రుణమాఫీ ఉత్తర్వులపై రైతులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. నాడు కేవలం రూ.50,000 వరకు మాత్రమే రుణమాఫీ ప్రకటించారు. అదీ కాకుండా లోన్ అమౌంట్ పెరిగే కొద్దీ మాఫీ మొత్తం తగ్గిపోతూ, రూ.1 లక్ష దాటిన వారికి కేవలం రూ.5,000 మాత్రమే ఫ్లాట్ వైవర్ ఇచ్చారు. ఇది టీవీకే ఎన్నికల మేనిఫెస్టోను వంచించడమేనని విపక్షాలు మండిపడ్డాయి. దీంతో వెనక్కి తగ్గిన సీఎం విజయ్, జూన్ 15న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పాత నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తూ సరికొత్త సవరించిన ప్యాకేజీ ని ప్రకటించారు.
తాజా జీవోలోని ముఖ్యాంశాలు.. అందరికీ వర్తింపు
తాజా సవరణ ప్రకారం ల్యాండ్ హోల్డింగ్స్ లేదా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా.. చిన్న, మధ్యరక, పెద్ద రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. సహకార బ్యాంకుల్లో రూ.75,000 లేదా అంతకంటే తక్కువ క్రాప్ లోన్ ఉన్న ప్రతి రైతుకు 100 శాతం పూర్తి రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ రుణం అంతకంటే ఎక్కువగా ఉంటే, వారికి ఒకే మొత్తంగా రూ. 35,000 ఫ్లాట్ రుణమాఫీ వర్తింపజేస్తారు. మే 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 మధ్య కాలంలో సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ ఊరట లభించనుంది.
నిధుల సర్దుబాటు ఎలా?
గతంలో ప్రకటించిన రూ.50,000 పరిమితి వల్ల ప్రభుత్వానికి కేవలం రూ.2,044 కోట్ల ఖర్చు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిమితిని రూ.75,000 కి పెంచడం, పెద్ద రైతులకు కూడా రూ.35,000 చొప్పున రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ బడ్జెట్‌పై ఏకంగా రూ.5,932.23 కోట్లు భారం పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. ఇలాంటి ప్రభుత్వ రుణమాఫీ నిధులను 45 నుండి 60 రోజుల్లోగా సహకార బ్యాంకులకు ప్రభుత్వం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయ్ స్పష్టం చేశారు.
విపక్షాల విమర్శలు..
ఈ నిర్ణయంపై అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి స్పందిస్తూ.. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం రూ.75,000 కు పరిమితం చేయడం సరికాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతులకు రుణ మాఫీ చేయాలని పళనిస్వామిడిమాండ్ చేశారు.








