Mahaa Daily Exclusive

  మెస్సీ, రొనాల్డో సరసన స్మృతి మంధాన!

Share

మెస్సీ, రొనాల్డో సరసన స్మృతి మంధాన!
* ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ క్రీడా జాబితాలో భారత మహిళా క్రికెటర్‌కు అరుదైన గౌరవం.
* ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డు.
* రికార్డుల రారాణి ప్రస్థానంపై ప్రశంసల జల్లు.
లండన్,మహా.
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ స్థాయిలో అత్యంత అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల-2026’ జాబితాలో ఆమెకు చోటు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా స్మృతి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత ఘనతతో ఆమె ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడా శిఖరాల సరసన నిలిచింది.
**రికార్డులు బద్దలు కొట్టడమే ఆమె నైజం**
ప్రపంచవ్యాప్తంగా తమ అసాధారణ ప్రతిభ, అద్భుత నాయకత్వ పటిమతో క్రీడారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులతో ఈ జాబితాను రూపొందించినట్లు టైమ్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. మహిళల క్రికెట్‌లో సరిహద్దులను చెరిపేస్తూ, వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకే స్మృతికి ఈ గౌరవం దక్కిందని ప్రశంసించింది. “స్మృతి మంధాన కోసం రికార్డులు ఎప్పుడూ బద్దలవుతూనే ఉంటాయి” అంటూ ఆమె ప్రొఫైల్‌లో టైమ్ మ్యాగజైన్ కొనియాడింది.
**స్మృతి ఖాతాలో అరుదైన రికార్డులు ఎన్నో..**
క్రికెట్ మైదానంలో స్మృతి సాధించిన పలు మైలురాళ్లను టైమ్ మ్యాగజైన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేశవాళీ వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ (ద్విశతకం) సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు నమోదు చేసిన మొదటి భారతీయ ప్లేయర్‌గా ఆమె రికార్డులను గుర్తుచేసింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 17 శతకాలతో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా రికార్డుల్లో సమంగా నిలిచిందని, అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిందని శ్లాఘించింది. ఆమె స్థిరమైన ఆటతీరుకు నిదర్శనంగా.. 2024లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన స్మృతి, 2025లో ఆ రికార్డును తానే తిరగరాయడం విశేషం.
**నాయకురాలిగా.. జట్టును గెలిపించే వీరురాలిగా..**
కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితం కాకుండా, ఒక అద్భుతమైన నాయకురాలిగా జట్టును విజయతీరాలకు చేర్చడంలో 29 ఏళ్ల స్మృతి మంధాన చూపిన చొరవను టైమ్ కొనియాడింది. ఆమె కెప్టెన్సీలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 2024, 2026 సంవత్సరాల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిళ్లను ముద్దాడింది. దీనికితోడు గత ఏడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో స్మృతి కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన టాప్ బ్యాటర్లలో ఒకరిగా నిలిచి దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసింది.