తమిళనాడులో రైతుల పంట రుణాల మాఫీ పరిమితి పెంపు!
* రూ. 75,000కు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం.
* సన్న, చిన్న, పెద్ద రైతులందరికీ వర్తింపు.
* పరిమితి దాటిన రుణాలపై రూ. 35,000 మినహాయింపు.
* 14.43 లక్షల మందికి లబ్ధి.
చెన్నై:మహా.
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీ పరిమితిని రూ. 75,000కు పెంచుతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గతంలో ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఈసారి సన్న, చిన్న, పెద్ద అనే వ్యత్యాసం లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది.
**ముఖ్యమంత్రి విజయ్ సమీక్షలో నిర్ణయం**
ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జూన్ 15న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2025 మే 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో సహకార బ్యాంకుల్లో రూ. 75,000 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తిస్తుంది. ఒకవేళ పంట రుణం మొత్తం రూ. 75,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అటువంటి రైతులకు రూ. 35,000 మేర రుణ మినహాయింపు లభిస్తుందని ప్రభుత్వం వివరించింది.
**ఖజానాపై రూ. 5,932 కోట్ల భారం**
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా సుమారు 14.43 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 5,932.23 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు అంచనా వేశారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో 8.33 లక్షల మంది సన్నకారు రైతులు, 5.16 లక్షల మంది చిన్న రైతులు ఉండగా.. 93 వేలకు పైగా పెద్ద రైతులు ఉన్నారు.
**ప్రతిపక్షాలు, రైతు సంఘాల ఒత్తిడితోనే..**
వాస్తవానికి, గతనెల మే 25న తమిళనాడు ప్రభుత్వం కేవలం సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే పరిమితం చేస్తూ రూ. 50,000 వరకు రుణమాఫీని ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీలతో పాటు వివిధ రైతు సంఘాల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాగు సంక్షోభం నేపథ్యంలో రైతులందరినీ సమానంగా ఆదుకోవాలని, వ్యత్యాసాలు చూపవద్దని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం తన మునుపటి నిర్ణయాన్ని పునఃసమీక్షించి, పరిమితిని పెంచుతూ రైతులందరికీ ప్రయోజనం చేకూరేలా ఈ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.








