అపోలో ‘హెల్త్‌టెక్’ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని!
* వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా అపోలో సంస్థ కీలక నిర్ణయం.
* 18 నుంచి 24 నెలల్లో ఐపీఓకు కొత్త సంస్థ.
* రూ. 25 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా అడుగులు.
హైదరాబాద్, మహా.
దేశంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ సంస్థ అయిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తన వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. అపోలో గ్రూప్ నుంచి డిజిటల్ హెల్త్, ఫార్మసీ విభాగాలను వేరుచేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్న అపోలో హెల్త్‌టెక్’ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకంతో కంపెనీ తన డిజిటల్ విభాగం విస్తరణ, ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రణాళికలను మరింత వేగవంతం చేసినట్లయింది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను అపోలో యాజమాన్యం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించింది.
**కొత్త సంస్థ.. భారీ లక్ష్యాలు**
అపోలో హాస్పిటల్స్ తమ డిజిటల్ హెల్త్, ఫార్మసీ వ్యాపారాలను వేరుచేసి ‘అపోలో హెల్త్‌టెక్’ పేరుతో ఒక ప్రత్యేక సంస్థగా తీర్చిదిద్దుతోంది. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఓమ్ని-ఛానెల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, టెలీహెల్త్ సేవలు వంటి అత్యంత కీలకమైన విభాగాలన్నీ ఈ కొత్త సంస్థ పరిధిలోకే వస్తాయి. రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఈ సరికొత్త సంస్థను ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని అపోలో యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. లిస్టింగ్ సమయానికి అపోలో హెల్త్‌టెక్ ద్వారా ఏటా రూ. 25 వేల కోట్ల భారీ ఆదాయాన్ని సాధించాలని నిర్దేశించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను చేరుకోవడంలో శోభన కామినేని సంస్థ తదుపరి వృద్ధి దశకు సమర్థవంతంగా నాయకత్వం వహిస్తారని అపోలో యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆమె తాజా నియామకానికి వాటాదారులతో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అధికారిక ఆమోదం లభించాల్సి ఉంది.
**గ్రూప్ పగ్గాలన్నీ కుమార్తెల చేతుల్లోనే..**
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి నలుగురు కుమార్తెలు. ప్రస్తుతం వారందరూ గ్రూప్‌లో అత్యంత కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతాప్ రెడ్డికి మూడో కుమార్తె అయిన శోభన కామినేని.. ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేనికి స్వయానా తల్లి. ఇక ప్రతాప్ రెడ్డి పెద్ద కుమార్తె డాక్టర్ ప్రీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, రెండో కుమార్తె సునీతా రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, చిన్న కుమార్తె డాక్టర్ సంగీతా రెడ్డి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గ్రూప్ అభివృద్ధిలో విశేషంగా పాలుపంచుకుంటున్నారు.
**సేవల్లో తర్వాతి తరం..**
గ్రూప్ వ్యాపార సేవల్లో ప్రతాప్ రెడ్డి తర్వాతి తరం కూడా చురుగ్గా భాగస్వామ్యమవుతోంది. శోభన కామినేని కుమార్తె ఉపాసన కామినేని ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘URLife’ అనే ప్రత్యేక వెల్నెస్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించిన ఉపాసన.. దానికి ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.








