సమాజ నిర్మాణంలో ప్రముఖుల పాత్ర కీలకం.
* ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రముఖులతో చర్చించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి.
* నటుడు సాయికుమార్, పారిశ్రామికవేత్త రామకృష్ణంరాజు, సామాజిక నేత నిజాముద్దీన్‌లతో భేటీ.
* వికసిత్ భారత్-2047 లక్ష్యంగా అందరూ కలిసి రావాలని పిలుపు.
హైదరాబాద్, మహా.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన పన్నెండేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధిని, పరివర్తనను వివరించే క్రమంలో భారతీయ జనతా పార్టీ వివిధ రంగాల ప్రముఖులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బీజేపీ జాతీయ కో-ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో పలువురు సినీ, పారిశ్రామిక, సామాజిక రంగాల ప్రముఖులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
దక్షిణాదిలో ప్రముఖ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పుడిపెద్ది సాయికుమార్‌తో సుధాకర్ రెడ్డి సమావేశమయ్యారు. సాయికుమార్ ఎన్సీసీ నావల్ క్యాడెట్‌గా, మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి దశాబ్దాలుగా కళారంగానికి చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. 2003 నుంచి బీజేపీ ప్రచారకర్తగా జాతీయవాద భావజాలంతో ఆయన చేస్తున్న కృషిని సుధాకర్ రెడ్డి ప్రశంసించారు. దేశంలో వస్తున్న సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయ చైతన్యాన్ని రగిలించడంలో సినిమా పోషిస్తున్న పాత్రపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం మిత్రా ఇండస్ట్రీస్, మిత్రా క్రియేషన్స్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రుద్రరాజు రామకృష్ణంరాజుతో డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సమావేశమయ్యారు. సృజనాత్మక, ఉత్పాదక రంగాల్లో విజయవంతమైన సంస్థలను నిర్మించిన రామకృష్ణంరాజును ఆయన అభినందించారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో వేగంగా మెరుగుపడుతున్న వ్యాపార అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాల విస్తరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు, నవ పారిశ్రామికవేత్తలకు అందుతున్న అవకాశాలపై వారు చర్చించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చే క్రమంలో పారిశ్రామిక రంగం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని వారు అభిప్రాయపడ్డారు.
సామాజిక సాధికారత, దేశ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘భారత్ కీ అన్మోల్ ఫౌండేషన్’, ‘గోధ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎండీ నిజాముద్దీన్‌ను కూడా సుధాకర్ రెడ్డి కలిశారు. ఎన్డీయే ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ పాలన, మహిళా సాధికారత, యువత అభివృద్ధి, జాతీయ భద్రత తదితర అంశాల్లో సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని నిజాముద్దీన్‌కు సుధాకర్ రెడ్డి అందజేశారు. ప్రజాకేంద్రక పాలన కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పులను ఈ సందర్భంగా వారు చర్చించారు.
సమాజ నిర్మాణంలో, ప్రజల ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దడంలో కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక నేతల పాత్ర అత్యంత కీలకమని, అందుకే ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ వారితో ఈ తరహా సమ్మేళనాలు నిర్వహిస్తోందని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ బీజేవైఎం కార్యదర్శి ఆర్. నరేన్ వర్మ, హైదరాబాద్ బీజేవైఎం నాయకుడు వంజర మహేష్ తదితరులు సుధాకర్ రెడ్డి వెంట ఉన్నారు.








