Mahaa Daily Exclusive

  హరిత సంక్షోభంలో తెలంగాణ….

Share

హరిత సంక్షోభంలో తెలంగాణ.
* పచ్చని అడవులు ‘సింగరేణి’ జిల్లాలకే పరిమితం.
* రాజధాని ముంగిట ఎడారి ఛాయలు!
* రాష్ట్ర అటవీ సంపదపై విభ్రాంతికర నిజాలు వెల్లడించిన అటవీశాఖ.
* ఒక్క శాతమూ అడవులు లేని కరీంనగర్, గద్వాల.
* కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్.
* సమతుల్యత దెబ్బతింటే వాతావరణ పెనుముప్పేనని పర్యావరణవేత్తల హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
తెలంగాణ పచ్చదనంపై అటవీశాఖ బాంబు పేల్చింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంపై ఆ శాఖ సమర్పించిన తాజా నివేదిక పర్యావరణ ప్రేమికులను, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒకవైపు కొన్ని జిల్లాలు దట్టమైన అటవీ సంపదతో ఊపిరిపోస్తుంటే.. మరోవైపు పారిశ్రామిక, పట్టణీకరణ జోరులో మరికొన్ని జిల్లాలు పూర్తిగా హరిత సంక్షోభంలో కూరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఈ అసాధారణ అసమానతలు భవిష్యత్తులో తెలంగాణను పర్యావరణ ముప్పులోకి నెట్టేసేలా ఉన్నాయని నివేదిక హెచ్చరిస్తోంది.
**తెలంగాణను బ్రతికిస్తున్న ‘ఉపాధి జిల్లాలే’ ఊపిరితిత్తులు!**
రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,122 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో అటవీ ప్రాంతం 27,688 చదరపు కిలోమీటర్లు (24.05 శాతం) మాత్రమే ఉంది. ఇందులోనూ సింహభాగం అడవులు కేవలం రెండు మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమవడం గమనార్హం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలే ‘తెలంగాణకు ఊపిరితిత్తులు’గా మారి రాష్ట్రాన్ని కాపాడుతున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4,311.38 చదరపు కిలోమీటర్ల అటవీ వైశాల్యంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక ములుగు జిల్లా అయితే తన మొత్తం భౌగోళిక భూభాగంలో ఏకంగా 71.82 శాతం అడవులను కలిగి ఉండి పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. వీటితో పాటు కుమురంభీం ఆసిఫాబాద్ (54.41 శాతం), జయశంకర్ భూపాలపల్లి (51.57 శాతం), మంచిర్యాల (45.17 శాతం) జిల్లాలు టాప్-5లో నిలిచాయి. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించిన ఈ జిల్లాల పచ్చదనమే రాష్ట్ర వాతావరణాన్ని కాపాడుతోంది.
**ఒక్క శాతమూ లేదు.. కరీంనగర్, గద్వాల దౌర్భాగ్యం!**
నివేదికలోని అసలు సిసలైన చేదు నిజాలు ఇక్కడే బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం వినడానికే విచిత్రంగా కేవలం 0.15 శాతం మాత్రమే మిగిలింది. అంటే అక్కడ ఉన్న మొత్తం అటవీ ప్రాంతం కేవలం 3.18 చదరపు కిలోమీటర్లు. సరళంగా చెప్పాలంటే, కరీంనగర్‌లో ప్రతి వెయ్యి ఎకరాల భూమిలో కేవలం ఒకటిన్నర ఎకరం మాత్రమే అడవి ఉందనే భయానక వాస్తవం స్పష్టమవుతోంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 0.29 శాతం, రాజధాని హైదరాబాద్‌లో 0.80 శాతం (కేవలం 1.45 చ.కి.మీ) మాత్రమే అడవులు ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరంలో జనాభా పెరగడం, పరిశ్రమలు విస్తరించడంతో అడవులు నశించిపోయాయి. జనగామ (1.22 శాతం), హనుమకొండ (2.35 శాతం) జిల్లాలు కూడా అట్టడుగు స్థానాల్లో నిలిచి హరిత సంక్షోభాన్ని కళ్ళకు కడుతున్నాయి.
**మిగిలిన జిల్లాల్లో అటవీ విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో) ఇలా..**
భారీ అడవులున్న నాగర్ కర్నూల్ జిల్లాలో 2,496.68 చ.కి.మీ., ఆదిలాబాద్‌లో 1,724.74 చ.కి.మీ., మహబూబాబాద్‌లో 1,397.12 చ.కి.మీ., నిర్మల్‌లో 1,216.61 చ.కి.మీ. మేర అడవులు ఉన్నాయి. కామారెడ్డి (882.82), నిజామాబాద్ (866.26), నల్గొండ (650.31), ఖమ్మం (616.56), మెదక్ (581.87), జగిత్యాల (559.32) జిల్లాలు మధ్యస్థంగా నిలిచాయి. అయితే వికారాబాద్ (445.42), రాజన్న సిరిసిల్ల (382.63), పెద్దపల్లి (338.79), రంగారెడ్డి (296.11), మహబూబ్‌నగర్ (286.17), సిద్దిపేట (257.61), సంగారెడ్డి (209.61), వరంగల్ (145.70), సూర్యపేట (125.39), యాదాద్రి భువనగిరి (118.05), వనపర్తి (115.85), మేడ్చల్ మల్కాజిగిరి (83.00), నారాయణపేట (79.12) జిల్లాల్లో అటవీ సంపద ప్రమాదకర స్థాయిలో క్షీణించింది.
**ప్రకృతి కన్నెర్ర జేస్తే పెను వినాశనమే!**
రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో కనీస స్థాయిలో కూడా అడవులు లేకపోవడం వల్ల భవిష్యత్తులో తెలంగాణ సమాజం ఊహించని పర్యావరణ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవులు మాయమైతే రుతుపవనాలు దారి తప్పి, వర్షపాతం పూర్తిగా అస్థిరంగా మారుతుంది. సకాలంలో వానలు పడక, భూగర్భజలాలు ఎండిపోయి అటు వ్యవసాయం దెబ్బతినడంతో పాటు ఇటు తాగునీటి కోసం జనం అల్లాడిపోయే కరవు రక్కసి పొంచి ఉంది. వాతావరణంలో వేడి రికార్డు స్థాయికి చేరి, చల్లదనం పూర్తిగా మృగ్యమవడం వల్ల ప్రజలు వింత రోగాల బారిన పడతారు. అడవుల్లో ఆశ్రయం కోల్పోయిన క్రూర జంతువులు, చిరుతపులులు ఆకలితో జనావాసాలపై పడి పల్లెలు, నగరాల్లో నిత్యం మారణహోమం సృష్టించే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మేల్కొని యుద్ధప్రాతిపదికన అడవులను రక్షించుకోకపోతే, తెలంగాణలో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని అటవీశాఖ నివేదిక తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది.